సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 8: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, త్వరలో సంగారెడ్డిలో 500 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖాన ఔట్ పేషంట్ విభాగాన్ని పరిశీలించి, నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. దవాఖాన శానిటేషన్‌పై ఆరా తీశారు. పరిశుభ్రత పాటించాలని, దవాఖాన సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మెడిసిన్ స్టాక్‌రూమ్, డయాలసిస్ సెంటర్‌ను పరిశీలించారు.
శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించిన మంత్రి వైద్య విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని పేర్కొన్నారు. బాధ్యత, జవాబుదారితనంతో విధులు నిర్వర్తించాలన్నారు. రోగులతో కలిసిపోతూ వైద్య వృత్తికి న్యాయం చేయాలన్నారు. జబ్బుపడిన ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రజలకు గుండెకాయ లాంటిదని స్పష్టం చేశారు. దవాఖాన పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ప్రైవేటు దవాఖానలో ఇష్టారాజ్యంగా వైద్యం చేయకుండా మెడికల్ చట్టాలను పాటించాలని సూచించారు. జిల్లా దవాఖానలో అన్ని పరికరాలు, యంత్రాలను అందుబాటులో ఉం చాలన్నారు. జిల్లాలోని ప్రజలందరూ ప్రభుత్వ దవాఖానలో వైద్యం చేయించుకోవాలని మంత్రి కోరారు. డయాలసిస్ బెడ్లు పెంచాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న హాస్టల్ భవనాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, ట్రైనీ కలెక్టర్ మనోజ్‌కుమార్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలాజగ్గారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, ఆర్డీవో వసంతకుమారి, డీఎంఈ డాక్టర్ వాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్‌కుమార్, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ గాయత్రీదేవి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని మంజీరా స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు మాణయ్య మంత్రికి విజ్ఞప్తి చేశారు. గురువారం సంగారెడ్డికి వచ్చిన మంత్రిని మంజీరా స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆయన వినతిపత్రం అందజేస్తూ సంగారెడ్డిలో ఇండోర్ స్టేడి యం,400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన క్రీడాకారులు ఉన్నారని, గతంలో ఉన్న స్పోర్ట్స్ అకాడమీలు క్రమంగా ఇక్కడి నుంచి తరలిపోయాయని వివరించారు.