శివ్వంపేట, అక్టోబర్ 4 : మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామ సబ్స్టేషన్ వద్ద రైతులు విద్యుత్ సమస్యపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వరి పంటలు చివరి దశలో ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా తరచూ ట్రిప్ అవుతుండటంతో మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి రోజుకు 9 నుంచి 12 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని రోజులుగా సమస్యను ఏఈ, ఏఈడీల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యుత్ సమస్య కారణంగా పంటలకు నష్టం జరిగితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని, సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో రైతులు నర్సింహా యాదవ్, మల్లారెడ్డి, సత్యనారాయణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మహేందర్ యాదవ్, వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్, సత్యనారాయణ, స్వామి, కృష్ణారెడ్డి, పోచా గౌడ్ తదితరులు ఉన్నారు.