కంది, ఆగస్టు 8: పారిశ్రామిక ఆటోమేషన్‌లో అధునాతన పరిశోధనలు,ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ముందడుగు వేసింది. ఐఐటీహెచ్‌లో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ప్రాసెస్ ఆటోమేషన్‌లో డాక్టర్ కృష్ణప్రసాద్ చిగురుపాటి చైర్ ప్రొఫెసర్షిప్ స్థాపనకు శుక్రవారం ఒప్పందం జరిగింది. ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ కృష్ణప్రసాద్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడంలో ఐఐటీహెచ్ ప్రొఫెసర్లకు ఈ ఒప్పందం ఎంతో దోహదపడుతుందన్నారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు, స్థిరత్వం, సామర్థ్యం, పారిశ్రామిక పరివర్తనకు కీలకమైన ప్రాసెస్, ఆటోమేషన్‌లో అధునాతన పరిశోధనలు ప్రోత్సహించడమే లక్ష్యంగా కృషిచేస్తామని తెలిపారు. ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఈ చైర్ ప్రొఫెసర్షిప్ స్థాపనకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్‌తో ఒప్పందం జరగడం ఆనందంగా ఉందన్నారు.
పరివర్తనాత్మక పరిశోధనలకు కేంద్రంగా మారాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ ఒప్పందం విద్య, పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రంగాల్లో ఆవిష్కరణలకు ఊతమిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఉమా చిగురుపాటి, చీప్ టెక్నాలజీ ఆఫీసర్ పీవీ శ్రీనివాస్, ఫైనాన్షియల్ ఆఫీసర్ ముఖేష్ సురానా, ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.