దుబ్బాక, జూలై 2: పంటల సాగులో రైతులు రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. దీంతో నేలలో సారం తగ్గి, పంట దిగుబడులపై ప్రభావం చూపుతున్నది. దీంతో పాటు రైతులకు పంట పెట్టుబడి ఖర్చులు అధికమవుతున్నాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువుల సాగుచేసేలా వ్యవసాయ అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నారు. రుతుపవనాల ఆరంభం సమయంలో పచ్చిరొట్ట సాగుచేయాలి. దీనిద్వారా భూసారాన్ని పెంచుకుని పంట దిగుబడిని పెంచుకోవచ్చు. వర్షాకాలంలో భూమి కోతకు గురికాకుండా అరికట్టవచ్చు. భూమిలో తేమ పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువుల ప్రాధాన్యతపై సిద్దిపేట జిల్లాలో వ్యవసాయాధికారులు రైతులకు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
పచ్చిరొట్ట ఎరువులతో లాభాలు…
భూమిలో భౌతికస్థితి మెరుగుబడి, గుల్లగా మారి భూమి పొరల్లో నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేలలో సేంద్రియ పదార్థాలు వేయడంతో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. జీవ రసాయనిక చర్యలతో నేలసారం పెరుగుతుంది. సాగుభూమి సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.భూమిలో క్లిష్ట రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చు. భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగపడాయి. జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పైరు వేసినప్పుడు వీటి వేర్లు ఎక్కువ లోతుకు వెళ్తాయి. తద్వారా భూమిలోపలి పొరల్లో నిక్షిప్తమైన అనేక పోషకాలను పంటకు అందించేందుకు దోహదపడుతాయి, పప్పుజాతి హరిత పంటలతో రేజోబియం అనే బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని వేళ్ల బొడిసెలతో ఎకరానికి 25 నుంచి 50 కిలోల నత్రజని స్వీకరిస్తాయి. వీటిలో భాస్వరం, గంధకం వంటి పోషకాల లభ్యత గణనీయంగా ఉంటుంది. సూక్ష్మపోషకాలను చీలెట్లుగా మార్చి పంట మొక్కలకు అందేలా చేస్తాయి. పచ్చిరొట్టే పైరు ఎరువుగానే కాకుండా పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయి.
సాగు విధానం…
జీలుగ పంట ఎకరా పొలంలో 25కిలోల విత్తనాలు పది కిలోల యూరియా వెదజల్లాలి. విత్తనాలు వెదజల్లిన తర్వాత ట్రాక్టరుతో దున్నాలి. వేసిన 30రోజుల నుంచి 40రోజుల్లో పంట పూత దశకు చేరుకుంటుంది. పూతదశకు వచ్చిన జీలుగ పంటను రోటోవేటర్ లేదా ఎద్దుల సహాయంతో దున్నించాలి. తర్వాత సింగిల్ సూపర్ పొటాష్ ఎరువును భూమిలో చల్లాలి. ఆనంతరం నీటిని వదిలి తడిపి పెట్టాలి. దీంతో పైరు కుళ్లిపోయి పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది.