రామచంద్రాపురం, జూలై 1: సిగాచీ ఫార్మా పరిశ్రమ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులను వివిధ దవాఖానలకు తరలించారు. దవాఖానలో క్షతగాత్రులకు సరైన వైద్య అందించడం లేదని, తమకు సరైన సమాధానం ఇవ్వడం లేదని క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ధృవ దవాఖానలో సిగాచీ కార్మికుడు భీమ్రావు(22) చికిత్స పొందుతున్నాడు.
అతని కుటుంబ సభ్యులకు సోమవారం పరిశ్రమ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. మీడియాలో వచ్చిన ప్రమాద వార్తలను చూసి పరిశ్రమ వద్దకు వెళ్లినా, అక్కడ భీమ్రావు ఆచూకీ తెలియలేదు. ఎవరిని అడిగినా అతనికి ఏమైంది, ఎలా ఉన్నాడనే సమాచారం ఇవ్వలేదు. చివరకు ధృవ దవాఖానలో చికిత్స పొందుతున్నాడని తెలుసుకొని దవాఖాన వద్దకు వచ్చి అతని తల్లి, సోదరి గుండెలవిసేలా రోదించారు.
పరిశ్రమ దగ్గర, దవాఖాన దగ్గర తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, తన తమ్ముడు ఎలా ఉన్నాడో చూద్దామంటే చూపించడం లేదని రోదించారు. ఎవరూ కూడా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, ఎవరూ తమని పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు.