సంగారెడ్డి, సెప్టెంబర్ 19: సంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సమన్వయంతో అమలు చేయాలని అధికారులకు దిశ కమిటీ చైర్మన్, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ సూచించారు. గురువారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి కమిటీ(దిశ) సమావేశం నిర్వహించారు. గతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం పేరును మార్చి దిశగా నామకరణం చేశామని చైర్మన్ తెలిపారు. నూతనంగా నియమితులైన సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ సురేశ్ షెట్కార్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే నంబర్‌వన్ జిల్లాగా సంగారెడ్డిని నిలపాలని, అందుకు అధికారుల సహకారం అవసరమన్నారు. లింగపల్లి నుంచి జహీరాబాద్ వరకు పారిశ్రామిక రంగం విస్తరిస్తున్నదని, ఇప్పటికే జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీ ప్రారంభించామని, నిమ్జ్ లో 5వేల ఎకరాల భూసేకరణ పూర్తి అయిందన్నారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులకు అం దేలా అధికారులు కీలకపాత్ర పోషించాలన్నారు.
అధికారుల తప్పిదంతోనే రుణమాఫీకి అన్నదాతలు దూరం : రఘునందన్‌రావు
సంగారెడ్డి జిల్లాలో సీడెడ్ సొసైటీల్లో రైతులు తీసుకున్న రుణాలకు మాఫీ ఎందుకు రాలేదని, ఇందుకు పాపం ఎవరిదని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం ఆరు నెలలుగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించినా, అధికారులు మాత్రం అర్హు ల జాబితా సిద్ధం చేయడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు.
జిల్లాలోని సీడెడ్ సొసైటీలు రు ద్రారం, నందికంది, తేర్పోల్, కొండాపూర్, మల్కాపూర్‌లలో దాదాపు రూ.20 కోట్ల మాఫీ నిలిచిపోయిందని, వెంటనే రుణమాఫీ వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతులు లేని క్వారీలపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని వసూలు చేయాలన్నారు. ఖాజీపల్లిలో నివాసాల దగ్గర బ్లాస్టింగ్లు చేస్తున్నారని, అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడానికి కారణలేమైన ఉన్నాయా అని ప్రశ్నించారు. 54 ఎకరాల్లో పీపీఆర్కే మినర ల్స్ యాజమాన్యం అక్రమ తవ్వకాలు జరుపుతున్నదని, వాటిపై సర్వే నిర్వహించి గ్రామాలకు హద్దులు ఏర్పాటు చేయాలన్నారు.
సమగ్ర నివేదికలతో రావాలి : కలెక్టర్ క్రాంతి
సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై అధికారులు పూర్తిస్థాయి నివేదికలతో హాజరుకావాలని, సం బంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు, సభ్యు లు లెవనెత్తిన సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. నేను లేను, కొత్తగా వచ్చాను అనే సమాధానాలు రావొద్దని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, శిక్షణ కలెక్టర్ మనోజ్, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.