నర్సాపూర్, డిసెంబర్ 20: తెలంగాణ రాష్ట్రం లో హిందు, ముస్లిం, క్రిస్టియన్ పండుగలకు పంపిణీ చేస్తున్న బట్టల సాంప్రదాయాన్ని బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ అమలు పరుస్తారని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్లో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు క్రిస్టియన్లకు కానుకలను ఎమ్మెల్యే, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ క్రిస్టియన్లకు కానుకల ద్వారా దుస్తుల పంపిణీ, విందు ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అన్ని మతాల వారి పండుగలకు బహుమతులను అందజేస్తున్నామన్నారు. దేశలో ఎక్కడ అన్యాయం జరిగినా ఆదుకోడానికి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించాడన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు శ్మశాన వాటికల్లో స్థలం గురించి కలెక్టర్‌తో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శం..
– రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి
ఏసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను క్రిస్టియన్ ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ బట్టలు పంపిణీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్ గుప్తా, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, ఇన్చార్జి ఆర్డీవో సాయిరాం, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు హరికృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ సాగర్, బీఆర్ఎస్ నాయకులు నగేశ్, ఆంజనేయులు, రాకేశ్‌గౌడ్, తహసీల్దార్ ఆంజనేయులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.