కాంగ్రెస్ వస్తే.. మళ్లీ కష్టాలే
వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరం లేదు. రైతులంతా 10 హెచ్‌పీ మోటర్లు వాడాలంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై రైతులంతా భగ్గుమంటున్నారు. స్వరాష్టంలో, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల కరెంట్ సరఫరాను చూసి ఓర్వలేక ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
- నాడు ఆరు గంటల కరెంట్‌తో ముప్పుతిప్పలు పడ్డం..
- మడి తడవక.. పంట చేతికి రాక అప్పుల పాలైనం..
- భూమి తగాదాలతో ఆగమైనం..
- కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు..ఎండిన పంటలు
- మూడు గంటలు, 10హెచ్‌పీ మోటర్లతో ముప్పు
- పెద్ద మోటర్లతో రైతులపై ఆర్థిక భారం
- కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అంటున్న అన్నదాతలు
- తెలంగాణ వచ్చినంకనే తీరిన కరెంట్ కష్టాలు
- ‘ధరణి’తోనే మా భూములు భద్రమంటున్న రైతులు
వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరం లేదు. రైతులంతా 10 హెచ్‌పీ మోటర్లు వాడాలంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై రైతులంతా భగ్గుమంటున్నారు. స్వరాష్టంలో, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల కరెంట్ సరఫరాను చూసి ఓర్వలేక ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కుట్రల కాంగ్రెస్‌కు ముకుతాడు వేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బాధలు పెట్టిన కాంగ్రెస్ తమకు వద్దని, బీఆర్ఎస్ పార్టీకే మద్దతని కర్షకులు తేల్చి చెబుతున్నారు. భూసమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో భూములకు సంబంధించిన కొట్లాటలు, కేసులకు చెక్ పడింది. ఎవరి భూమి వారి పేరుపై నిక్షిప్తమై ఉండడంతో రైతులంతా భరోసాతో ఉన్నారు. అలాంటి పాదర్శక పోర్టల్‌ను తాము అధికారంలోకి వస్తే రద్దు చేసి భూమాత పోర్టల్ తీసుకొచ్చి మళ్లీ పాతపద్ధతే అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా రైతులంతా ఏకతాటిపైకొచ్చి అడ్డుకోవాలని పిలుపునిస్తున్నారు.
– సంగారెడ్డి జిల్లా నెట్వర్క్, నవంబర్ 23
10 హెచ్‌పీ మోటార్లు అవసరమే లేదు
ఏ రైతు కూడా 10 హెచ్‌పీ కరెంటు మోటర్లు వాడే పరిస్థితి లేదు. ఇప్పుడు మా ప్రాంతంలో వేల సంఖ్యలో బోర్లు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కారు వచ్చాక ఇప్పుడు 8 నుంచి 10 మోటర్లకు వాటి సామర్థ్యం స్థాయి ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి కరెంటు అందిస్తున్నారు. ఈ క్రమంలో 10హెచ్‌పీ మోటరు బిగిస్తే ఎక్కువ లోడుతో రన్నింగ్ ఎక్కువై, బోరు తలంలో ఉన్న జలాలు గంటలోపే ఖాళీ అవుతాయి. లోడు అధికమై ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోతాయి. దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం. అందుకే 24 గంటలు కరెంటు ఇచ్చే కేసీఆర్ సార్కే మద్దతు ఇస్తాం.
– కృష్ణ సాగర్, రైతు, పెద్ద ముబారక్పూర్, సిర్గాపూర్ మండలం
కరెంటు కష్టాలు తెలిస్తే గట్లా మాట్లాడారు..
కరెంటు కష్టాలు తెలిస్తే గట్ల మాట్లాడరు. మూడు గంటల కరెంటని, 10 హెచ్‌పీ మోటర్లని చెబుతున్నారు. గతంలో కరెంట్ సరిపోక మస్తు తిప్పలపడ్డం. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇవ్వడంతో సమస్య తీరిపోయింది. కాంగ్రెస్ వాళ్లు చెప్తున్న 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే కాలిపోతయి. తిప్పలు పడాల్సి వస్తది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇస్తున్న 24 గంటల కరెంటుతో వ్యవసాయం మంచిగా నడుస్తుంది. రైతులు ఎవరైనా కోరుకునేది పొలం మంచిగా పండాలనే కోరుకుంటారు.
– మల్లేశం, గుడెం గ్రామం, అందోల్ మండలం
కాంగ్రెసోళ్లకు కమీషన్లు దొరుకుతలేవు..
పేదోళ్ల భూములను కబ్జా పెట్టేందుకు కాంగ్రెసోళ్లకు అవకాశం దొరుకుత లేదు. తొమ్మిదేండ్ల నుంచి తొమ్మిది రూపాల కమీషన్లు వస్తలేవు. పట్వారీలను తిరిగి తీసుకువస్తే రైతుల కొంపలు మునిగిపోతయి. కాంగ్రెసోళ్లు ధరణిని బంగాళాఖాతంలోకి పడవేస్తామనడం వారి మూర్కత్వానికి నిదర్శం. ఆఫీసుల బయట దళారులను పెట్టుకొని ఒకరి భూమి మరొకరి పేరు మీద మార్చేవారు. పట్వారీలకు లంచం ఇచ్చేదాక పని చేసేది కాదు. సీఎం కేసీఆర్ పెట్టిన ధరణితో ఎవరి భూములు వారి వద్ద భద్రంగా ఉన్నయి. రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు నారాయణఖేడ్ పోవాల్సి వచ్చేది. మధ్యదళారిని వెంట తీసుకువెళ్తే ఖర్చు అధికమయ్యేది. ధరణితో మీ సేవల్లో, ఆన్లైన్లో అమ్మినా, కొన్నది రిజిస్ట్రేషన్లు రైతు నేరుగా చేసుకుంటున్నం. రేవంత్‌రెడ్డి గెలిస్తే కదా ధరణి తీసేందుకు. పీడ కలలాంటి రోజులను కాంగ్రెస్ తీసుకువచ్చేందుకు కుట్ర పన్నుతున్నరు. రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్, మరోమారు కేసీఆర్ సీఎంగా పదవి స్వీకరించడం ఖాయం.
– పాత్లోత్ గణపతి నాయక్, పొమ్యానాయక్ తండా, కల్హేర్ మండలం
మూడు గంటల కరెంటుతో వ్యవసాయం ఎలా చేయాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తామనడం విడ్డూరంగా ఉంది. మూడు గంటల కరెంటుతో ఎలా వ్యవసాయం చేయాలో వారికే తెలియాలి. రాష్ట్ర ప్రభుత్వం 24గంటల కరెంటు ఇస్తుండటంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. గతంలో రైతులను ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్, మళ్లీ రైతులకు ఇబ్బందులు కలిగించేవిధంగా ప్రకటనలుచేయడం వారికి రైతులపై అభిప్రాయం ఏంటో తెలిసిపోతుంది. ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు.
– కిషన్‌రావు, ముచ్చర్ల, హత్నూర
ధరణి తీసేస్తే రైతులు మునుగుడే..
అప్పట్లో వీఆర్వోల రాజ్యం ఉన్నప్పుడు రికార్డుల్లో భూబదలయింపులు చేసి ఏదో ఒకటి రాసి రైతులను ఇబ్బంది పెట్టేటోళ్లు. ఇండ్లు, ఆఫీస్‌ల చుట్టూ తిప్పుకుంటూ డబ్బులు అడుగుతూ, ముప్పు తిప్పలు పెట్టెటోళ్లు. సీఎం కేసీఆర్ వచ్చినంక ధరణి పెట్టి రైతుల భూముల రికార్డులను సరి చేసిండు. ధరణి వచ్చినంక ఘర్షణలు లేకుండా రైతులు ప్రశాంతంగా ఉంటున్నరు. మళ్లీ కాంగ్రెస్ వస్తే ధరణి తీసేసుడో లేకుంటే ఏదో చేసుడో అంటుండు రేవంత్‌రెడ్డి. అది మాత్రం రైతులను ముంచుడు కోసమేనని మాకు తెలుసు.
– చింతల వినయ్ కుమార్, జోగిపేట (వట్పల్లి)
వ్యవసాయానికి 24 కరెంటే కావాలి
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోదు. 24 గంటల కరెంటే కావాలి. వ్యవసాయానికి మూడు గంటల కరెంటుచాలని, రైతులందరూ 10 హెచ్‌పీ మోటర్లు వాడాలని రేవంత్‌రెడ్డి అనడం ఆయన అవివేకానికి నిదర్శనం. 10హెచ్‌పీ మోటర్లను రైతులు కొనలేరు. పైగా మూడు గంటల కరెంటు సరఫరా సమయంలో అందరూ ఒకేసారి మోటర్లు ఆన్‌చేస్తే ట్రాన్స్ఫార్మర్ల మీద ఎంత లోడ్ పడుతుంది. కాలిపోవడం, వాటిని బాగు చేసే వరకు పొలాలు నీళ్లు లేక ఎండిపోవడం జరుగుతుంది. ఇవన్నీ బాధలు అనుభవించినం. మళ్లా కొత్తగా ఇవే బాధలు మేం పడలేం.
– మేదరి రాంచందర్, రైతు, జిన్నారం
మూడు గంటల కరెంట్ సరిపోదు..
మూడు గంటల కరెంట్ పొలాలకు ఎట్ల సరిపోతదో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలే. 24 గంటల కరెంట్ ఇవ్వడంతో ఇప్పుడు రైతులు ఎదార్థంగా బతుకుతున్నరు. లేనిపోని మాటలు చెప్పి రైతులను నిండా ముంచేతందుకే కొత్త కథ సురువుజేసిండు. రేవంత్‌రెడ్డి మాటలు నమ్ముకుంటే రైతులు మల్లా రాత్రి కరెంట్ ఎక్కడవయరో అంటూ పాము, తేలు కాట్లకు గురై అక్కడే సచ్చినా సస్తం. సాధ్యం కాని హామీలు ఇచ్చి రైతులను మోసం చెయ్యాలని చూస్తున్నారు. 10 హెచ్‌పీ మోటర్లు పెడితే ఫ్యూజ్‌లు ఉంటాయా? కాంగ్రెస్ నాయకులకు రైతుల గోసలు తెలియవు. కాంగ్రెస్ నాయకుల మాటలు పట్టించుకోవద్దు.
– లక్ష్మయ్య, సీరూర్, రాయికోడ్ మండలం
గిప్పుడు రైతులు కంటినిండా నిద్రపోతుండ్రు..
ధరణి పోర్టల్‌తో రైతులు కంటి నిండా నిద్రపోతున్నరు. అదే తీసేస్తే పైరవీకార్లు రాజ్యమేలుతరు. పటేల్ పట్వారీ వ్యవస్థలో క్షణాల్లో పహాణీలో పట్టాదారు పేరు దొంగతనంగా మార్చేది. రైతులు చెప్పులరిగేలాగా తిరిగినా పనులు కాకపోయేవి. ధరణితో దళారులు, లంచాలకు చెక్ పడింది. పటేల్ పట్కారీ వ్యవస్థలో డబ్బులకు ఆశపడి దొంగ రిజిస్ర్టేన్లు చేసిన్రు. ధరణిని కాంగ్రెసోళ్లు బంగాళాఖాతంలో వేస్తామనడం అవివేకం. దాని తీసేస్తే రెవెన్యూ వ్యవస్థ ఆగమైతది. పట్టెదారుకు తెల్వకుంటనే భూమి మార్పిడి జరుగుతది. ధరణితో ఒకేసారి రిజిస్ర్టేషన్, మ్యుటేషన్ జరిగి అప్పుడే అమ్మినవారి పేరు పోయి కొన్నవారి పేరు మీద భూమి నమోదైతది. ఫోన్లో మన భూముల వివరాలు కనిపిస్తున్నయ్. భూమి కొలవాలంటే ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరిగేది. నేడు ఫోన్లోనే వస్తుంది. ఒక వేళ ధరణి మారిస్తే రైతులు నెలకోసారి మీసేవకు పోయి మా పేర్లమీద భూమి ఉన్నదా వేరే పేర్లకు ఎక్కిందా అని చూసుకోవాల్సి వస్తది. సీఎం కేసీఆర్ సార్ పుణ్యమా అని ధరణి పేర 90శాతం రికార్డులు అవకతకలు లేకుండా చేసిన్రు.
– ఇందూరి సదాశివుడు, రైతు, ఆత్మకూర్, సదాశివపేట మండలం
ధరణి లేకపోతే భూముల పట్టాలు ఆగమైతాయి..
వ్యవసాయ భూముల పట్టాలు పటిష్టంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ వ్యవస్థ రూపొందించారు. ఈ వ్యవస్థను తీసేసి పాత రెవెన్యూ పద్ధతిని కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటిస్తున్నారు. అట్ల చేస్తే రైతుల భూములు ఆగమైతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తేవడంతో రైతులకు బాధలు తీరినవి, పైరవీలు, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లకు ఇచ్చే లంచాలు ఇప్పుడు లేవు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి, ఓటేస్తే మాత్రం రైతుల పరిస్థితి ఆగమ్యగోచరమైతుంది. మేమంతా బీఆర్ఎస్ మళ్లీ రావాలని కోరుకుంటున్నం.
– సత్యనారాయణ గౌడ్, గోసాయిపల్లి, సిర్గాపూర్ మండలం
సిగ్గు, శరం లేని రేవంత్‌రెడ్డికి కరెంటు విలువేమి తెలుసు
కాంగ్రెస్ అంటేనే కండ్లల్లో నీళ్లు తిరుగుతయి. కాంగ్రెస్ ఉన్నప్పుడూ తండాల్లో కరెంటు సక్కగా ఉండకపోతుండే. పంటలు మంచిగా పండేటివి కాదు. బతుకు దెరువుకు వలసలు పోయేది. కాంగ్రెసోళ్ల పాలనలో కరెంటు ఇచ్చినప్పుడు బావుల కాడ పండుకునేటోళ్లం. టూ ఫేస్ కరెంటు ఇచ్చినప్పుడూ కండెన్షర్లను బిగించుకొని మోటర్లను నడిపించుకొని నీళ్లు పారబెట్టేది. రేవంత్‌రెడ్డి భూమి ఉంటే ముందుకు మూడు గంటల కరెంటుతో ఎన్ని ఎకరాలు పండిస్తావో ముందు నీవు ప్రయత్నించు. సీఎం కేసీఆర్ పుణ్యమా అంటూ 24గంటలు కరెంటు రావడంతో పంటలు బాగా పండించుకుంటున్నం. ఉన్న చోటనే పనులు దొరకడంతో చాలామంది వలసలు పోతలేం. ఎన్ని చెప్పినా కాంగ్రెస్ గెలవనే గెలవదు.
రైతులందరూ సీఎం కేసీఆర్‌కే ఓట్లు వేస్తం.
– మూడవత్ రమేశ్, కాల్వోని కుంట తండా, కల్హేర్ మండలం
తెల్లందాక పొలాల కాడనే పండేటోళ్లం..
కాంగ్రెస్ గవర్నమెంటులో కరెంటుకోసం తెల్లందాక పొలాల కాడనే పండేటోళ్లం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో 24 గంటల కరెంటుతో అనందంగా ఉన్నం. ఇరాంలేకుండా కరెంటు వస్తుండడంతో పుష్కలంగా పంటలు పండుతున్నయ్. కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంటు, 10 హెచ్‌పీ మోటర్లు అంటున్నరు. కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లా మోసపోవుడే. అందుకే కేసీఆర్‌కే మద్దతు.
– పట్లోల్ల నర్సింహారెడ్డి, రైతు, ఉసిరికపల్లి, వట్పల్లి మండలం
ధరణితోనే రైతులకు ఎంతో మేలు
ధరణితోనే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని మతిలేని మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. ధరణి పోర్టల్‌తోనే రైతుల భూములకు భద్రత ఉంది. పట్వారీ వ్యవస్థలో భూములు తారుమారై రైతులు ఎంతో మంది నష్టపోయారు. ధరణి తీసేస్తే మళ్లీ పాత రోజులు చవిచూడాల్సిందే. రైతును రాజుగా చేసిన బీఆర్ఎస్కు అండగా ఉంటాం.
– మేకల నర్సింలు రైతు, మక్త అల్లూర్ గ్రామం, కంది మండలం
పట్వారీలు మళ్లీ..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తే రెవెన్యూలో మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరుగుడు తప్పది. రైతులు కోర్టుల చుట్టూ తిరిగి సమస్యలతో ఇబ్బంది పడిపోతారు. కాంగ్రెస్ ఇస్తున్న హామీలు కౌలు రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్ ప్రభుత్వం తెచ్చిన ధరణితో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. కాంగ్రెసోళ్లు పాత పద్ధతిలో పట్వారీ వ్యవస్థను తీసుకురావాలని చూడటం దారణం.
– రైతు, ఎల్లయ్య, గంగారం, కొండాపూర్ మండలం
కాంగ్రెస్‌ను నమ్మేదే లేదు..
ఓట్ల కోసం మాయమాటలతో వస్తున్న కాంగ్రెసోళ్లను నమ్మేదే లేదు. కాంగ్రెస్ పాలనలో పడ్డ తిప్పలు చాలు. రైతులను ఆగం చేయాలని చూస్తే సహించేది లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతులకు మేలు జరిగింది. 24 గంటల కరెంట్‌తో ఇబ్బంది తప్పి పంటలు బాగా పండుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోసం ఎదురు చూసే వాళ్లం. అర్ధరాత్రి పొలాలకు నీరు పెట్టే వాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సంతోషంగా ఉన్నాం. రైతులకు 3గంటల కరెంట్ చాలంటున్న కాంగ్రెసోళ్లకు ఓటు ద్వారానే తగిన బుద్ధి చెప్పాలి. మాకు ఉన్న మోటర్లు చాలు 10 హెచ్‌పీ మోటర్లతో మాకు పని లేదు. కాంగ్రెస్‌కు ఓటు వేసి మా బతుకులు ఆగం చేసుకోం. రైతులకు అన్ని విధాల అండగా ఉంటున్న బీఆర్ఎస్కు అండగా ఉంటాం.
– మన్నె అశోక్, రైతు, మక్త అల్లూర్ గ్రామం, కంది మండలం
మూడు గంటల కరెంట్‌తో ఎనుకటి రోజులే దిక్కు
మూడు గంటల కరెంట్ అంటే మళ్లీ మాకు ఎనుకటి రోజులే దిక్కు అవుతాయ్. అసలు మూడు గంటల విద్యుత్ ఎట్లా సరిపోతదో రేవంత్‌రెడ్డికే తెలువలే. 24 గంటల కరెంట్‌తోనే ఇప్పుడు రైతులు సంతోషంగా బతుకుతున్నారు. 10 హెచ్‌పీ మోటర్లు పెడితే అయింతా కాలిపోతాయ్. కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవద్దు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు. ఆయనకే రైతులంతా మద్దతు తెలపాలి. కాంగ్రెస్ వాళ్లు కుదరని హామీలు ఇచ్చి రైతులను మోసం చెయ్యాలని చూస్తున్నారు. రైతుల కోసం ఆలోచిన సీఎం కేసీఆర్‌కే మళ్లీ సీఎం కావాలే.
– నంద్యా నాయక్, తండా, కొండాపూర్ మండలం
మూడు గంటల కరెంటుతో ఏంజెసుకోవాలి
సాగుకు మూడు గంటల కరెంటు సరిపోతదని కాంగ్రెసోళ్లు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. వాళ్లను గుండెల మీద చేతులు పెట్టుకొని చెప్పమనండి. వ్యవసాయం పని చేసెటోళ్లకే సాగు కష్టాలు తెలుస్తయి. ఊకదంపుడు ప్రచారం చేసే నాయకులకు ఏం తెలుస్తది. కేసీఆర్ సర్కారు ఉచితంగా 24 గంటల విద్యుత్తును వినియోగించుకొని లాభాదాయకమైన పంటలు పండించుకుంటున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు తిప్పలు మళ్లీ వస్తాయి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కోరుకోవడమే రైతులకు శ్రేయస్కరం. మూడోసారి సీఎం కేసీఆర్ సర్కారే మాకు కావాలి.
– బాలన్న, రైతు, పెద్ద ముబారక్పూర్, సిర్గాపూర్ మండలం
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

