బొల్లారం, నవంబర్ 12: పారిశుధ్య కార్మికుడి మృతిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ తోటి కార్మికులు ధర్నాకు దిగారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలో రెండు రోజుల క్రితం 17వ వార్డు బాలాజీనగర్‌లో ఓపెన్ డ్రైనేజీలో చెత్తను తొలిగించేందుకు దిగిన పారిశుధ్య కార్మికుడు లంబాడి నరసింహ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మంగళవారం కార్మికుడి మృతి పై పారిశుధ్య కార్మికులంతా ఏకమై పాత మున్సిపల్ కార్యాలయం ప్రధాన చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ ధర్నాకు పలు కార్మిక సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారని, ఆ కుటుంబానికి అన్ని విధాలా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఓ దశలో కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పారిశుధ్య కార్మికుల భద్రతపై కార్మిక నాయకులు వరప్రసాద్‌రెడ్డి, గుండ్ల మహేందర్‌రెడ్డి, ఆనంద్ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్డీవో రవీందర్‌రెడ్డి నిరసనకారుల వద్దకు చేరుకొని శాంతించాలని సూచించారు. అనంతరం స్థానిక నాయకులతో చర్చించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చూస్తామని, మున్సిపల్ తరఫున వచ్చే బెనిఫిట్స్ అందిస్తామన్నారు. కార్మిక నాయకులు పటాన్చెరు ఎమ్మెల్యేగూడెం మహిపాల్‌రెడ్డితో జరిగిన ఘటన వివరించి ఆదుకోవాలన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించేలా కృషి చేస్తామన్నారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదం తెలుపుతూ తీర్మానం చేయాలని సూచించారు. దాదాపు రెండు గంటల పాటు ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన ధర్నా వల్ల ట్రాఫిక్ స్తంభించింది. ఎమ్మెల్యే, జిల్లా అధికారుల చొరవతో కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ స్థానిక నాయకులు నిరసనకారులకు నచ్చజెప్పి ధర్నా విరమింప చేశారు. కార్యక్రమంలో కమిషనర్ మంగతాయారు, సీఐ గంగాధర్, మున్సిపల్ మేనేజర్లు మల్లికార్జున్, నిర్మలారెడ్డి, కౌన్సిలర్లు శ్రీకాంత్ యాదవ్, సాయి కిరణ్‌రెడ్డి, స్థానిక నాయకులు గుండ్ల మహేందర్‌రెడ్డి, రాజ్‌గోపాల్, కార్మిక సంఘాల నాయకులు నాగేశ్వరరావు, జై భీమ్ సభ్యులు, పారిశుధ్య కార్మికులు, స్థానికులు పాల్గొన్నారు.