సిద్దిపేట, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం వైద్యంపై ప్రత్యేక దృష్టిని సారించింది. ప్రతి ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ఉండాలని చెప్పి ఇటీవలనే జిల్లాకు కొత్తగా వైద్యులను కేటాయించింది. వారంతా తమకు కేటాయించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధుల్లో చేరారు. అక్కడ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఆదిశగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించి కార్పొరేట్ స్థాయిలో దవాఖానలను తీర్చిదిద్ధింది. ఇప్పుడు ఏ ప్రభుత్వ దవాఖానను చూసినా కార్పొరేట్ దవాఖాన స్థాయిలో ఉన్నాయి. ఎక్కడికక్కడ ప్రజలకు వైద్యం అందించి ఆరోగ్య జిల్లాగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. పట్టణాల్లో అవసరాల మేరకు బస్తీ దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది.
జిల్లాకు 34 మంది కొత్త డాక్టర్లు
ఆరోగ్య జిల్లా దిశగా అడుగులు పడుతున్నాయి. వైద్యరంగంలో ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ దవాఖానలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులను కల్పిస్తున్నది. సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లాకు చెందిన వారు కావడంతో వైద్యరంగం మరింత బలోపేతమవుతోంది. పట్టణాల్లో అవసరాల మేరకు బస్తీ దవఖానలను సైతం ఏర్పాటు చేస్తున్నారు .జిల్లాలో 33 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 194 ఆరోగ్య ఉప కేంద్రాలు, 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 1 ఏరియా దవాఖాన, 1 జనరల్, 1 జిల్లా దవాఖాన, 2 పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు కొత్తగా 34 మంది వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
కొత్తగా నియామక ఉత్తర్వులు పొందిన వైద్యాధికారులంతా వారికి కేటాయించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధుల్లో చేరారు. వారికి కేటాయించిన ప్రాంతాల్లో వైద్యులు తమ వైద్య సేవలు అందిస్తూ తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నారాయణరావుపేట, నంగునూరు (2), పుల్లూరు, మిరుదొడ్డి, భూంపల్లి, దౌల్తాబాద్, రామక్కపేట, జగదేవ్‌పూర్, తీగుల్(3), కొండపాక, కుకునూరుపల్లి, ములుగు, ఇందుప్రియాల్, రాయపోల్, వర్గల్ (5) సిరిగిరిపల్లి (2), ఆమేదిపూర్, హుస్నాబాద్ (2) తోటపల్లి(2), మద్దూరు, అక్కన్నపేట (2),రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నూతన వైద్యులు విధుల్లో చేరి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.
వర్గల్ ప్రభుత్వ దవాఖానకు ఆరుగురు
వర్గల్, జనవరి 7:వర్గల్ ప్రభుత్వ దవాఖానకు నూతనంగా మరో ఆరుగురు వైద్యులు వచ్చారు. దీంతో ప్రభుత్వ వైద్యుల సంఖ్య ఏడుకు చేరింది. పూర్తి సిబ్బంది, వైద్యులతో వైద్యసేవలకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. రెండురోజుల్లో ఆరుగురు వైద్యులు బాధ్యతలు తీసుకోవడంతో దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. కొత్తగా వచ్చిన డాక్టర్లు కిరణ్‌కుమార్, దీప, మౌనిక, మీనా, భాస్కర్, హరితతో కలుపుకొని వైద్యుల సంఖ్య ఏడుకు చేరింది..కొత్త డాక్టర్ల రాకపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు.
గ్రామాల్లో ఉద్యోగం చేయడం ఇష్టం
మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), జనవరి 7: గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించడమే ఇష్టం. ఇక్కడి ప్రజలు కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు, అలాంటి వారికి మెరుగైన వైద్యం అందించి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నదే లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శనివారం భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించా.రోజూ ప్రజలకు అందుబాటులో ఉంటా. నేరుగా ప్రజలు దవాఖాకు వచ్చి వైద్య సేవలు పొందాలని కోరుతున్నా. వైద్య సిబ్బంది కూడా విధుల్లో నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పేదలకు వైద్య సేవలు అందిస్తా.
-సాయి తేజస్విని, భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్
సంతోషంగా ఉన్నది
మిరుదొడ్డి, జనవరి 7 : పల్లెటూరిలో ఉండే ప్రజలకు వైద్యం చేయడం సంతోషంగా ఉన్నది. ఇంతకు ముందు చదువు పూర్తి కాగానే కాంట్రాక్టు పద్ధతిలో మేడ్చల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2020 నుంచి 2022 మే వరకు పనిచేశా. ఇటీవల ప్రభుత్వం ఉద్యోగాల నియామకం చేపట్టింది. మిరుదొడ్డి డాక్టర్‌గా బాధ్యతలు చేపట్టా. పట్టణాల్లో ఉద్యోగం చేస్తే సంతృప్తికరంగా ఉండదు. అదే గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి, నాకు మంచి పేరు వస్తుంది. ప్రజలు కూడా మమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తూ సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు మంచి పేరు తీసుకొస్తా.
– డాక్టర్ సమీనా సుల్తానా, మిరుదొడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
పుల్లూరు క్లస్టర్ నూతన వైద్యుడిగా ఉదయ్‌కుమార్
సిద్దిపేట రూరల్, జనవరి 7: సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు క్లస్టర్ నూతన వైద్యుడిగా చొప్పదండి ఉదయ్‌కుమార్ శనివారం విధుల్లో చేరారు. రాజగోపాల్‌పేట మండలం నుంచి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. క్లస్టర్ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉంటానని, సీజనల్ వ్యాధులపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం కరోనా భయం లేదని, ప్రజలు పరిశుభ్రత పాటించాలని సూచించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆశ కార్యకర్తలు గర్భిణులకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ వైద్యం పొం దేలా అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు.
పేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యం
రాయపోల్, జనవరి 7: గ్రామాల్లో నిత్యం పేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తానని రాయపోల్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ బల్ల మహరాజ్ అన్నారు.శనివారం పీహెచ్సీ మండల వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో సిద్దిపేటలోని సర్జికల్ మెడికల్ క్యాజివాలిటీలో విధులు నిర్వహించినట్లు తెలిపారు. రాయపోల్ పీహెచ్సీ వైద్యాధికారిగా ఉద్యోగోన్నతి వచ్చిందన్నారు.బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు సిబ్బంది సహకారం తీసుకుంటానన్నారు. గ్రామా ల్లో పర్యటించి పేదలకు వైద్య సేదలు అందించడమే లక్ష్యమన్నారు. ఉదయం ఓపీ చూసుకొని మిగతా సమయంలో గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని ఆయన స్పష్టం చేశారు.
‘కంటి వెలుగు’ విజయవంతం చేస్తా
మద్దూరు(ధూళిమిట్ట), జనవరి7: గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలకు వైద్య సేవలందించే అవకాశం దక్కడం మా అదృష్టం. నేను గతంలో కాంట్రాక్ట్ డాక్టర్‌గా యాదాద్రి-భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట పీహెచ్సీలో వైద్యురాలిగా పనిచేశా. ప్రస్తుతం రెగ్యులర్ డాక్టర్‌గా ఉద్యోగాన్ని సంపాదించి మొదటి పోస్టింగ్ మద్దూరు వైద్యాధికారిగా వచ్చా. పీహెచ్సీలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలందిస్తా. ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగులాంటి బృహత్తరమైన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తా.
– డాక్టర్ రజిత, మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి
బాధ్యతలు స్వీకరించిన సత్యప్రకాశ్
జగదేవ్‌పూర్ జనవరి7: జగదేవ్‌పూర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్‌గా సత్యప్రకాశ్ శనివారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ మెడికల్ ఆఫీసర్‌గా పని చేసిన మహేశ్‌కుమార్ (పీజీ)ఉన్నత చదువుల కోసం వెళ్లగా, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో పని చేసిన సత్యప్రకాశ్ బదిలీపై జగదేవ్‌పూర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్సీ పరిధిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు.
– సత్యప్రకాశ్, జగదేవ్‌పూర్ మెడికల్ ఆఫీసర్
వైద్య సేవలు అందించేందుకు కృషి
సర్కారు దవాఖానకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తా. గత కొన్నేండ్లుగా సిద్దిపేటలో కాంట్రాక్టు వైద్యుడిగా పనిచేశా. ప్రభుత్వం ఇటీవల నూతన నియామకాలు చేపట్టింది. రెగ్యులర్ వైద్యుడిగా హుస్నాబాద్ సీహెచ్‌సీలో జనవరి 1వ తేదీన నియామకం కావడం ఆనందంగా ఉన్నది. సర్కారు దవాఖానకు పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా వస్తుంటారు. వారికి పూర్తిగా నయమయ్యేలా చికిత్స చేసి సర్కారు వైద్యంపై నమ్మకం ఏర్పడేలా చేస్తా. ప్రభుత్వం నా విద్యార్హతను గుర్తించి ప్రభుత్వ వైద్యుడిగా నియమించినందుకు కృతజ్ఞుడిగా ఉంటా. వైద్యరంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఉచిత వైద్య చికిత్సలు అందించేందుకు కృషి చేయడం హర్షనీయం.
-డాక్టర్ కె.సంజీవ్‌కుమార్, సామాజిక ఆరోగ్య కేంద్రం, హుస్నాబాద్