పటాన్చెరు రూరల్, జూన్ 3: ఎన్‌సీసీతో ధృఢమైన వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుందని ఎన్సీసీ కల్నల్ రమేశ్ సిరియాల్ అన్నారు. పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్ ఆవరణలో పది రోజులుగా నిర్వహిస్తున్న ఎన్సీసీ శిబిరం ముగింపు ఉత్సవాలకు మంగళవారం సంగారెడ్డిలోని 33(టీ) బెటాలియన్ ఎన్సీసీ క్యాంప్ కమాండెంట్, కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రమేశ్ సరియాల్ హాజరై క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బలమైన వ్యక్తిత్వం, జాతీయ భావాలు ఈ క్యాంప్ద్వారా అలవరుతాయని తెలిపారు. ఐక్యత, క్రమశిక్షణ, స్థితిస్థాపకత విలువలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుందని, దానిని గుర్తించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీవితం విసిరే చాలెంజ్‌లను స్వీకరించి శారీరకంగా, మానసికంగాను ధృఢంగా మారి సక్సెన్‌ను సాధించాలన్నారు. గీతం సంస్థ అద్భుతమైన సౌకర్యాలను కల్పించిందని కొనియాడారు.
దాదాపు 650మంది క్యాడెట్లు ఈ ఎన్సీసీ సమగ్ర శిక్షణ శిబిరంలో పాలొన్నట్లు తెలిపారు. గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, అతిథ్య విభాగం- క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఎ.ఫిలిప్ హాజరై మాట్లాడారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతిభను చాటిన క్యాడెట్లకు బహుమతులు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సుబేదార్ మేజర్ రాం హరి గుల్జార్, కెప్టెన్ పి విజయ, లెఫ్టినెంట్ ఆర్ మహేందర్‌రెడ్డి, లెఫ్టినెంట్ యాదగిరి, జె.శంకరయ్య, గీతం ఎన్సీసీ కేర్‌టేకర్ ఆఫీసర్ ఎస్.అజయ్‌కుమార్ పాల్గొన్నారు.