Anganwadi | కరీంనగర్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్: ‘ఓడెక్కె దాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభ ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది. తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులతో కలిపి ఏ నెలకు ఆ నెల జీతాలు విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చినా.. తీరా గెలిచిన తర్వాత జీతాలు పెంచడం దేవుడెరుగు? ఉన్న జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఫలితంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రెండు నెలలుగా జీతాల కోసం ఎదురు చూడాల్సి వస్తున్నది.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ ఆరేండ్లలోపు బాలల కు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యనందిస్తున్నారు అంగన్వాడీలు. అలాగే, ప్రభుత్వం నిర్వహించే పలు సర్వేలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అయినా నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. వేతనాలు పెంచాలని అనేక ఆందోళనలు చేసినప్పుడల్లా కంటితుడుపుగా రూ.వందో రూ.200లో పెంచేవారు. అవి ఏ మూలకూ సరిపోక ఇబ్బంది పడేవారు. కానీ, కేసీఆర్ సర్కారు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారింది. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్ఠికాహారాన్ని అందించే కీలకమైన సేవల్లో ఉన్న అంగన్వాడీలకు సముచిత స్థానం కల్పించింది. కేంద్రంతో నిమిత్తం లేకుండా చిరుద్యోగుల సంక్షేమాన్ని చూసుకున్నది. తెలంగాణ వచ్చినప్పుడు అంగన్వాడీ టీచర్లకు కేవలం రూ. 3,200, హెల్పర్లకు ఇంకా తక్కువ వేతనం ఉండగా, రాష్ట్రం వచ్చిన వెంటనే వీరికి వేతనా లు పెంచింది. టీచర్లకు నెలకు రూ.13,650, హెల్పర్లకు రూ.7,800 వేతనం అందించింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా వేతనాలు పెంచలేదు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లుగా రెండు సార్లు పీఆర్సీ అమలు చేసింది. అయితే కరోనా విపత్కర కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా.. సంక్షేమాన్ని మాత్రం ఆపలేదు. ఉద్యోగులకు అటో ఇటో వేతనాలు కాస్త ఆలస్యమయ్యాయి కానీ, ఏనెల కూడా వేతనాలు ఆపలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు గడిచింది. కానీ, ఇప్పటికీ వరకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు జీతాలు విడుదల చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదా పు 35వేల సెంటర్లలో పనిచేస్తున్న 65 వేల అంగన్వాడీలు రెండు నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు 1475, ఆయాలు 1255, మెదక్ జిల్లాలో 1076 మంది అంగన్వాడీ టీచర్లు, 1076 మంది ఆయాలు ఉన్నారు. జీతాలు పెంచడమేమో గానీ, ఉన్న జీతాలు సక్రమంగా పంపిణీ చేయడం లేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఏరు దాటినంక తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తున్నదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. జీతాలు లేక తమ కుటుంబాల పరిస్థితి కడుదయనీయం గా మారతున్నదని, అప్పులు చేయాల్సి వ స్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తా ము ఎదుర్కొంటున్న పరిస్థితులపై కాంగ్రెస్ నాయకుల ఎదుట గోడు వెళ్లబోసుకుందామంటే, కనీసం వారిని కలిసే సమయం కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు.