కోహీర్, మే15: ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ యాజమాన్యం సంవత్సరం గడిచినా వేతనాలు చెల్లించడం లేదని కార్మికుడు హల్చల్ చేశాడు. బుధవారం జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామ ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ కార్మికుడు రమేశ్‌బాబు పరిశ్రమ ఆవరణలో ఉన్న పొగ గొట్టమెక్కి నిరసన వ్యక్తం చేశాడు. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు వేతనం చెల్లించలేదని పరిశ్రమ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చేతిలో డబ్బులు లేకుండా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. బకాయి వేతనాలు చెల్లించడంతోపాటు వెంటనే పరిశ్రమను ప్రారంభించాలని కోరాడు. పరిశ్రమ నడువకపోవడంతో కార్మికులంతా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పరిశ్రమకు రావడం, పోవడానికి మాత్రం ఖర్చులు భరించాల్సి వస్తున్నదని, అధికారులు కూడా తమను సతాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
పరిశ్రమను ప్రారంభించి ఇక్కడి చెరుకు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. చక్కెర పరిశ్రమకు పూర్వ వైభ వం తీసుకురావాలని, తమ సమస్యలు పరిష్కరించకుంటే ధర్నా నిర్వహిస్తామని కార్మికులందరూ స్పష్టం చేశారు. జహీరాబాద్ పట్టణ సీఐ రవి ఘట నా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రమేశ్ బాబుతోపాటు పరిశ్రమలో విధులు నిర్వహించే మరో కార్మికుడి ఇంట్లో వివాహాలు ఉండడంతో వెంటనే రూ.2లక్షల చొప్పున మంజూరు చేయిస్తామని కార్మిక శాఖ అధికారులు, స్థానిక నేతలు చెప్పడంతో పొగ గొట్టంపై నుంచి కిందకు దిగాడు. వచ్చే బుధవారం పరిశ్రమ ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో చర్చలు నిర్వహించి కార్మికులకు న్యాయం చేస్తామన్నారు.