సోమవారం 30 మార్చి 2020
Medak - Mar 07, 2020 , 06:42:14

‘ప్రగతి’ కాంతులు

‘ప్రగతి’ కాంతులు
  • ‘పట్టణ ప్రగతి’లో సమస్యల పరిష్కారం
  • నాలుగు మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు
  • డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు
  • రహదారులకు మరమ్మతులు, నూతన పైపులైన్ల నిర్మాణం, నర్సరీల ఏర్పాటు
  • విద్యుత్‌ సమస్యలకు పరిష్కారం
  • హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణవాసులు

స్వచ్ఛ పట్టణాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాన్ని ‘ప్రగతి యజ్ఞం’లా కొనసాగించింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఏన్నో ఏండ్ల్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు సమసిపోయాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ‘క్లీన్‌ సిటీ’ సాకారమవుతున్నది. మెదక్‌ మున్సిపాలిటీలో 277 మెట్రిక్‌ టన్నులు, నర్సాపూర్‌ మున్సిపాలిటీలో 15 మెట్రిక్‌ టన్నులు, తూప్రాన్‌ మున్సిపాలిటీలో 100మెట్రిక్‌ టన్నుల చెత్త, రామాయంపేట మున్సిపాలిటీలో 80టన్నుల చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించారు. పారిశుధ్యంతోపాటు విద్యుత్‌ సమస్యలకు పరిష్కారం లభించింది. శిథిలావస్థలో ఉన్న ఇండ్ల తొలగింపుతోపాటు తాగునీటికి బోరుబావులను తవ్వారు. రహదారులకు మరమ్మతులు, నూతన పైపులైన్ల ఏర్పాటు, అనుమతి లేని లే అవుట్ల  గుర్తింపు, హరితహారం కార్యక్రమం కోసం నర్సరీల ఏర్పాటుతోపాటు పలు అభివృద్ధి పనులు చేశారు. పది రోజులు పండుగలా సాగిన ‘పట్టణ ప్రగతి’లో డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలతో పట్టణవాసుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

- మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 


మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘పట్టణప్రగతి’ కార్యక్రమం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మంచి ఫలితాలను ఇచ్చింది. ఎన్నో ఏండ్లుగా వార్డుల్లో ఉన్న సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లెప్రగతి’ స్ఫూర్తితో ‘పట్టణప్రగతి’ కార్యక్రమాన్ని నిర్వహించింది. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో వార్డుసభ్యులు, వార్డు ప్రత్యేక అధికారులు, వార్డు నోడల్‌ అధికారులను నియమించింది. పారశుధ్యం, తాగునీరు, విద్యుత్‌, హరితహారం వంటి కార్యక్రమాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నది. అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించి ఒక్కో వార్డులో నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేటలలో ‘పట్టణప్రగతి’లో భాగంగా ఎన్నో ఏండ్లుగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభించింది. నర్సాపూర్‌లో నిర్వహించిన ‘పట్టణప్రగతి’లో మంత్రి హరీశ్‌రావు పాల్గొని పలు సమస్యలకు పరిష్కారం చూపారు. బస్టాండ్‌కు సమీపంలో ఉన్న కుంటను సుందరీకరణ చేసేందుకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రామాయంపేట, మెదక్‌ మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ నగేశ్‌, తూప్రాన్‌లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డితో పాటు కలెక్టర్‌ ధర్మారెడ్డి ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పదిరోజుల పాటు నిర్వహించిన ‘పట్టణప్రగతి’ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాల్వలో పూడికతీత, పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు, డంపింగ్‌ యార్డులకు స్థలాలు, శ్మశాన వాటికల గుర్తింపు, నూతన విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు, ఖాళీ స్థలాల్లో కలుపు మొక్కల తొలగింపు, రహదారులకు మరమ్మతులు, నూతన పైపులైన్ల ఏర్పాటు, అనుమతి లేని లేఔట్ల గుర్తింపు వంటి కార్యక్రమాలు చేపట్టారు. పట్టణప్రగతిలో భాగంగానే అధికారులు నాలుగు మున్సిపాలిటీల్లో మెప్మా ఆధ్వర్యంలో చేపట్టిన సర్వేలో 8054 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. 


మెదక్‌లో అభివృద్ధి పనులు .. 

277 మెట్రిక్‌ టన్నుల చెత్తను డంపుయార్డుకు తరలించారు. 53 విద్యుత్‌ స్తంభాలు వేసి విద్యుత్‌ సమస్యలు తీర్చారు. 51 కిలో మీటర్ల సీసీరోడ్లు, 8 శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించారు. మొత్తం 32 వార్డుల్లో 140.50 కిలో మీటర్ల డ్రైనేజీ పనులు, కలుపు మొక్కలు, తుమ్మ చెట్లను తొలగించి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దారు. తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు 11 బోరుబావులను వేయడం జరిగింది. పట్టణప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేశారు. మెదక్‌ పట్టణంలో అదికారులు చేపట్టిన సర్వేలో 3235 మంది నిరక్షరాస్యులను గుర్తించారు.


నర్సాపూర్‌ పట్టణంలో.. 

నర్సాపూర్‌ మున్సిపాలిటీలో 15 మెట్రిక్‌ టన్నుల చెత్తను డంపుయార్డుకు తరలించారు. నర్సాపూర్‌లోని ఆరువార్డుల్లో 15బోరు బావులు తవ్వి తాగునీటి సమస్యను తీర్చారు. డ్రైనేజీ, పారిశుధ్య పనులను చేపట్టి సీసీ రోడ్లను శుభ్రపరిచారు. పలు వార్డుల్లో తుమ్మ చెట్లను కలుపు మొక్కలను తొలగించారు. శిథిలావస్తలో ఉన్న 80 ఇండ్లను తొలగించారు. పంట కాల్వలను శుభ్రం చేశారు. స్టేడియం కోసం కళాశాల మైదానంలో పాత భవానల తొలగింపు, నర్సాపూర్‌ పట్టణంలో చేపట్టిన సర్వేలో 1473 మంది నిరక్షరాస్యులను గుర్తించారు.   


రామాయంపేట పట్టణంలో..

రామాయంపేటలో 100 విద్యుత్‌ స్తంభాలను సరిచేసి విద్యుత్‌ సమస్య లేకుండా చేశారు. 80టన్నుల చెత్త సేకరణ, 12 పాడుబడ్డ ఇండ్లను తొలగించారు. మట్టిని అక్కడ నుంచి తరలించి శుభ్రపరిచారు. తడి పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. 8కిలోమీటర్ల మేర డ్రైనేజీలను శుభ్రం చేసి పారిశుధ్య పనులు నిర్వహించారు. 12 వార్డులలో చెత్తా చెదారాన్ని, కలుపు మొక్కలను తొలగించారు.  రామాయంపేటలో చేపట్టిన సర్వేలో 2157 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. 


తూప్రాన్‌ పట్టణంలో..

100 మెట్రిక్‌ టన్నుల చెత్తను డంపుయార్డుకు తరలించారు. 61కిలో మీటర్ల డ్రైనేజీ మురికి కాల్వలను శుభ్రం చేశారు. 71కిలో మీటర్ల రోడ్లలో పారిశుధ్య పనులను నిర్వహించారు. శిథిలావస్థకు చేరిన 43 ఇండ్లను తొలగించారు. 53 విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్‌ సమస్యను తీర్చారు. తూప్రాన్‌ పట్టణంలో చేపట్టిన సర్వేలో 1189 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. తూప్రాన్‌ పట్టణానికి 44లక్షల నిధులు మంజూరయ్యాయి.  


logo