ఆదివారం 29 మార్చి 2020
Medak - Jan 10, 2020 , 11:51:26

అన్ని మున్సిపాలిటీలు గులాబీవే కావాలి

అన్ని మున్సిపాలిటీలు గులాబీవే కావాలి

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, లోక్‌సభ, స్థానిక సంస్థలు వరుస ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. మొన్నటి మొన్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లోనూ బ్రహ్మాండమైన విజయాన్ని టీఆర్‌ఎస్ సాధించింది. సర్వేలన్నీ కారు గుర్తుకే అనుకూలంగా ఉన్నాయి. సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తే అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురడం ఖాయం అని అందరు కలసికట్టుగా పని చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. గురువారం జరిగిన టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ హితబోధ చేశారు.

బీ ఫాంల అందజేత
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి బీ-ఫాంలను ఆయా మున్సిపాలిటీల ఇన్‌చార్జీలకు అందించారు. తూప్రాన్ మున్సిపాలిటీకి ఇన్‌చార్జిగా ఉన్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి బీ-ఫాంలను సీఎం కేసీఆర్ అందించారు. మెదక్, రామాయంపేట రెండు మున్సిపాలిటీలకు సంబంధించి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ బీ-ఫాంలను అందజేశారు. నర్సాపూర్ మున్సిపాలిటీలకి సంబంధించిన బీ-ఫాంలను ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి సీఎం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతీ మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు గెలిచేందుకు టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులంతా కష్టించి పని చేయాలని సూచించారు. ఏమరపాటు లేకుండా అప్రమత్తతో ఎన్నికల్లో విజయబావుట ఎగురవేయాలని సూచనలు చేశారు. ఎన్నికల అనంతరం పట్టణాల్లో చేయబోయే అభివృద్ధి తీరుతెన్నులపైనా వివరించారు. ఆయా మున్సిపాలిటీల్లో ప్రచార తీరు తదితర అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలను ఎమ్మెల్యేలకు సూచించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రచార శైలిపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా జిల్లాలో నాలుగు స్థానాల్లో గులాబీ జెండాను ఎగురవేసేందుకు పార్టీ ముఖ్యనాయకులు ముందుకు సాగుతున్నారు.


logo