ఆరుతడి, ఆయిల్ పామ్ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి
జడ్పీ సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 12 : జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద సీసీ రోడ్లకు రూ.28 కోట్లు నిధులు మం జూరయ్యాయని, పనులకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని కలెక్టరేట్లో జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలోని మండలాల్లో సీసీరోడ్లతో పాటు బీటీ రోడ్లు రెన్యువల్ పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పీఆర్ ఎస్ఈ కనకరత్నంకు సూచించారు. ఉపాధిహామీ పథకం కింద 378 సీసీ రోడ్లకు రూ.22.91 కోట్లు మంజూరైనట్లు పీఆర్ ఎస్ఈ తెలిపారు. జిల్లాలో 57 కిలో మీటర్ల బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు రూ.9 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. తూప్రాన్‌లో రూ.7 కోట్లు, మనోహరబాద్‌లో రూ.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల కాంప్లెక్స్ నిర్మాణాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎస్ఈ వివరించారు. వైద్యారోగ్య శాఖపై సమీక్షిస్తూ కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్‌లో మెదక్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. రెండో విడుత వ్యాక్సినేషన్ సైతం వందశాతం పూర్తయిందని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు బూస్టర్ డోస్ 9వేల మందికి వేసినట్లు చెప్పారు.
ఇంటింటి జ్వర సర్వేలో మొదటి విడుతలో లక్షా 89వేల గృహాల్లో జ్వర స్వరే నిర్వహించామన్నారు. నూతన మండల కార్యాలయాల్లో ఫర్నిచర్, సిబ్బంది కొరత తీర్చాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి సూచించారు. వ్యవసాయ శాఖపై సమీక్షిస్తూ ప్రభుత్వ సూచనల మేరకు యాసంగిలో వరికి బదులు ఇతర పంటలపై రైతులు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని, గతేడాది జిల్లాలో 2లక్షల 26 ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి లక్ష ఎకరాలకు తగ్గించినట్లు జిల్లా వ్యవసాయధికారి పరశురాంనాయక్ తెలిపారు. ఆరుతడి పంటలతో పాటు ఆయిల్ పామ్ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ఇతర పంటలతో ఆర్గానిక్ పంటలను సైతం ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలి నిజాంపేట జడ్పీటీసీ విజయ్‌కుమార్ వ్యవసాయధికారికి సూచించారు. చిలిపిచెడ్ ఎంపీపీ కార్యాలయం లో సిబ్బంది నియమించాలని ఎంపీపీ వినోద అదనపు కలెక్టర్‌ని కోరారు. నిజాంపేట మండల కేంద్రంలో 17.20 గుంటల భూమి కబ్జా చేశారని, కబ్జా నుంచి విలువైన భూమిని కాపాడాలని జడ్పీటీసీ విజయ్‌కుమార్ సభ దృష్టికి తెచ్చారు. చేగుంట దవాఖానలో వారానికోసారి వైద్యుడు వస్తున్నాడని, దీంతో రోగులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఎంపీపీ శ్రీనివాస్ సభ దృష్టికి తీసుకువచ్చారు. నర్సాపూర్ శివారులో 118 సర్వే నంబర్లో 2 ఎకరాల భూమి మిస్ అయిందని, ఆ భూమిని వెంటనే తేల్చాలని అదనపు కలెక్టర్ రమేశ్‌కు విజ్ఞప్తి చేశారు. పట్టా భూమిని అసైన్డ్ భూమిగా చూపుతున్నారని, తహసీల్ కార్యాలయంలో సం ప్రదిస్తే డబ్బులు అడుగుతున్నారని కొల్చారం జడ్పీటీసీ మేఘమాల ఆదనపు కలెక్టర్ దృష్టి తీసుకువచ్చారు.
ఎమ్మెల్సీ యాదవరెడ్డికి సన్మానం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన యాదవరెడ్డిని జడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి, ఆదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, జడ్పీటీసీలు శాలువాతో సన్మానించారు. సమావేశంలో ఆయా శాఖ జిల్లా అధికారులు, జడ్పీటీలు, ఎంపీపీలు తదితర అధికారులు పాల్గొన్నారు.