మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jun 08, 2020 , 03:08:57

కన్నెపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ

కన్నెపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ

లక్షెట్టిపేట రూరల్‌ (దండేపల్లి) :  దండేపల్లి మండలం కన్నెపల్లి స్టేజీ దగ్గర జాతీయ రహదారిపై ఆదివారం సూపర్‌ లగ్జరీ బస్‌, ఇసుక టిప్పర్‌ ఢీకొనడంతో లారీ డ్రైవర్‌ మృతి చెందగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ఉట్నూర్‌ డిపోనకు చెందిన ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు 15 మంది ప్రయాణికులతో బయలు దేరింది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కన్నెపల్లి స్టేజీ దగ్గరకు రాగానే.. మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు ఇసుక లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌.. ఎదురెదురుగా ఢీకొన్నాయి. అతివేగంగా ఢీకొనడంతో లారీ, బస్సు బోల్తాపడ్డాయి. బస్సు డ్రైవర్‌ తిరుపతి, ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మిగతా వారు స్వల్పంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్‌ రవి (40) ఇంజిన్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. సమాచారమందుకున్న దండేపల్లి, లక్షెట్టిపేట సీఐ నారాయణ నాయక్‌, సీఐలు శ్రీకాంత్‌, దత్తాద్రి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్‌లో ఇరుక్కున్న లారీ డ్రైవర్‌తో పాటు ప్రయాణికులను అంబులెన్స్‌లో లక్షెట్టిపేట, మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలకు తరలించారు. దండేపల్లి మండలం గుడిరేవుకు చెందిన రాజవ్వ, జన్నారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన యశోద, జన్నారానికి చెందిన బస శశికుమార్‌, వరంగల్‌ జిల్లాకు చెందిన త్రివేణి, ధర్మపురికి చెందిన రాధాకృష్ణ, కాసిపేట మండలం ముత్యంపల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ తిరుపతి, నిజామాబాద్‌ జిల్లా సదానగర్‌ మండలం యాచారం తండాకు చెందిన లారీ డ్రైవర్‌ రవిని మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. లారీ డ్రైవర్‌ రవి మృతి చెందాడు. ఆర్టీసీ డ్రైవర్‌ అల్లోల తిరుపతిని ఆర్టీసీ డీఎం మల్లేశ్‌ మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో పరామర్శించారు. కాగా, లారీ క్లీనర్‌ సురక్షితంగా బయటపడ్డాడు.


logo