మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Feb 12, 2020 , 02:00:22

నాణ్యమైన విద్యతోనే ఐఎస్‌వో సొంతం..

నాణ్యమైన విద్యతోనే ఐఎస్‌వో సొంతం..

పూర్తిస్థాయి బోధన సిబ్బంది

కళాశాలలో బోధనా అనుభవం ఉన్న నిష్ణాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. మొత్తం మూడు గ్రూపులు ఉన్నాయి. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రూమెంటేషన్‌, మైనింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ గ్రూప్‌లు ఉన్నాయి. విద్యాసంవత్సరంలో ప్రతి గ్రూప్‌లో 60 చొప్పున విద్యార్థులు ప్రవేశం పొందుతారు. ప్రతి గ్రూప్‌కు హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌, సీనియర్‌ లెక్చరర్‌, ఐదుగురు లెక్చరర్లతో విద్యాబోధన కొనసాగుతోంది. సరిపడా కార్యాలయ సిబ్బంది ఉన్నారు. గ్రంథాలయంలో 14వేల ఈ పుస్తకాలు, 1500 ఇతర పుస్తకాలు ఉన్నాయి. పూర్తిస్థాయి పరికరాలతో ప్రతి గ్రూప్‌నకు నాలుగు చొప్పున ప్రయోగశాలలు ఉన్నాయి. అన్ని గ్రూప్‌లకు ఉమ్మడిగా భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, ఆంగ్లం, మెకానికల్‌ వర్క్‌షాప్‌ ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి సెక్షన్‌కు ఒక కంప్యూట్‌ ల్యాబ్‌ ఉంది. ఎస్సీ, ఎస్టీ ఫైనల్‌ విద్యార్థులకు 30 ల్యాప్‌ట్యాప్‌లు అందజేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం అత్యాధునిక కంప్యూటర్‌లతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

విశాలమైన వసతిగృహాలు

కళాశాల క్యాంపస్‌లోనే బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతిగృహాలు ఉన్నాయి. అన్ని సౌకర్యాలతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వసతిగృహాలు కొనసాగుతున్నాయి. పరిశుభ్రమైన వంటశాల, విద్యార్థులకు సరిపడా డైనింగ్‌ హాల్‌ అందుబాటులో ఉన్నాయి. బాలుర వసతిగృహంలో 200 మంది విద్యార్థులు, బాలికల వసతిగృహంలో 80మంది ఉంటున్నారు. మెనూ ప్రకారం ప్రతి రోజు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. అలాగే వీరి కోసం కేటాయించిన రీడింగ్‌ రూమ్స్‌లో ఏకాగ్రతతో చదువుకుంటున్నారు. వార్డెన్ల పర్యవేక్షణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతిగృహాలు కొనసాగుతున్నాయి. గతేడాది కళాశాల ప్రాంగణంలో రూ.2 కోట్లతో ఎస్సీ, ఎస్టీ బాలుర వసతిగృహానికి శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది.

క్యాంపస్‌లో వైఫై సేవలు

కళాశాల క్యాంపస్‌లో వైఫైను అందుబాటులోనికి తీసుకువచ్చారు. వైఫై సేవలను వినియోగించుకుంటూ విద్యార్థులు సాంకేతిక, కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. బయోమెట్రిక్‌ ద్వారా విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది తమ హాజరును నమోదు చేసుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ మిషన్‌ ద్వారానే హాజరు వేస్తూ పూర్తి పారదర్శకత పాటిస్తున్నారు. కళాశాల మరింత అభివృద్ధి కోసం ఎన్‌.బీ.ఏ(నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌) గుర్తింపు కోసం దరఖాస్తు చేశారు. ఈ గుర్తింపు వస్తే కళాశాలకు సమృద్ధిగా నిధులు, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ పెరిగే అవకాశం మెండుగా ఉంది. 2019లో నిర్వహించిన సృజన టెక్‌ఫెస్ట్‌ పోటీల్లో రాష్ట్రస్థాయిలో విద్యార్థులు పాల్గొని తమ కోర్సు సంబంధిత అంశాలను ప్రదర్శించారు. ఇంటర్‌ పాలిటెక్నిక్‌ స్పోర్డ్స్‌ అండ్‌ గేమ్స్‌-2019 రాష్ట్రస్థ్ధాయి ఖోఖో పోటీల్లో ప్రతిభచూపిన విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మైనింగ్‌ విభాగం 2015-16, 2016-17 బ్యాచ్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ బెల్లంపల్లి రీజియన్‌లోని వివిధ గనుల్లో ఉద్యోగాలు పొందారు. కళాశాలలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందగా ఇటీవలలో ఓ విద్యార్థి ఎస్సైగా ఎంపికయ్యాడు. ఎలక్ట్రికల్‌ విభాగంలోని విద్యార్థులు సబ్‌ ఇంజినీర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కళాశాల ఆవరణలో స్వచ్ఛభారత్‌, హరితహారం కార్యక్రమాలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారు.


logo