ఈ సృష్టిలో కల్తీ లేనిది ఏదైనా ఉందంటే అది అది తల్లిపాలే.. నవమాసాలు గర్భంలో ఉన్న బిడ్డతో ప్రేమ బంధాన్ని మరింత బలోపేతం చేసేది ఇవే.. తల్లి పాలే తొలి ఆహారం.. మహిళలు.. మాతృమూర్తిగా మారే సమయానికి పాలు ఉత్పత్తి కావడం సృష్టి ధర్మం.. ఆ ధర్మాన్ని నాటి నుంచి నేటి వరకు మనిషితోపాటు అన్ని క్షీరదాలు తమ బిడ్డలను పాలతోనే పెంచుతున్నాయి.. సమతుల్య ఆహారాన్ని.. రోగ నిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని అందించేంది ఈ పాలే.. కానీ కొందరు తల్లులు కొన్ని అపోహలు.. ఉద్యోగ, ఆరోగ్య రీత్యా.. ఇతరత్రా కారణాలతో పోత పాలు పడుతున్నారు.. అందుకే తల్లి పాల విశిష్టతను, ప్రాముఖ్యతను తెలిపేందుకే తల్లిపాల వారోత్సవాలకు ఐసీడీఎస్, డీఎంహెచ్వో శాఖలు శ్రీకారం చుట్టాయి. ఇవి ఆగస్టు మొదటి వారంలో ప్రతి ఏడాది నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
ప్రతి ఏడాది ఆగస్టు ఒకటో తేదీ నుంచి వారంపాటు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పుట్టిన గంటలోపే బిడ్డకు పాలిచ్చేలా తల్లికి సాయం చేయాలన్నదే వారోత్సవాల ఉద్దేశం. పుట్టిన బిడ్డకు ఏమీ తెలియకపోయినా ఒక విద్య మాత్రం తెలుసు.. అదే పాలు తాగడం.. బిడ్డ పాలు తాగగానే తల్లికి తేలిక కావడం ఇది.. ఒక మధురానుభూతికి లోనవడం సృష్టి ధ ర్మం. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా జరుగుతుంది. పుట్టిన బిడ్డకు ముర్రుపాలు ఇస్తే హాని, దోషమని కొందరు భావిస్తుంటారు. అలాగే పసుపు రంగులో ఉండ టం, చిక్కని పాలు తాగితే అరగవని అనుకోవడం, పాలు ఇస్తే అందం తరుగుతుందనే కొందరి మూర్ఖత్వంతో అమృతతుల్యమైన తల్లిపాలకు బిడ్డలను దూరం చేస్తున్నారు. నేటి తల్లులు తల్లిపాల సంస్కృతిని, సామాజిక బాధ్యతను విస్మరిస్తూ పసిబిడ్డల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నా రు. నేటి కంప్యూటర్ యుగంలో పుట్టిన బిడ్డలకు తల్లిపాలు పట్టడం గగనమైందని చెప్పొచ్చు. అందుకే ఎనిమిది రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఐసీడీఎస్, డీఎంహెచ్వో శాఖల ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను జరపనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముర్రుపాలతో కలిగే లాభాలను తల్లులకు వివరించనున్నారు. తల్లిపాల ఆవశక్యతపై అవగాహన కల్పించనున్నారు.
అంతరించిపోతున్న తల్లిపాల సంస్కృతితో పుట్టిన బిడ్డలు వివిధ లోపాలతో చనిపోతున్నారు. తల్లుల్లో వచ్చిన మార్పునకు మారిన పారిశ్రామీకరణనే అని చెప్పొచ్చు. ఇది ఆరంభమైన నాటి నుంచి మహిళకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువయ్యాయి. దీంతో చాలా వరకు ఉద్యోగాలలో చేరారు. విధులకు హాజరుకావాలన్నా హడావిడిలో బిడ్డల కుపాలు ఇవ్వడానికి వారికి సమయం సరిపోవడం లేదు. దీంతో డబ్బా పాలపై ఆధార పడాల్సి వస్తుంది. పట్టణాల నుంచి పల్లెల వరకు ఈ సంస్కృతి పాకింది. తల్లిపాల కంటే డబ్బా పాలే బిడ్డకు శ్రేయస్కరమన్న అపోహ తల్లుల్లో నాటుకుపోయింది. కానీ డబ్బా పా ల నష్టాలు, కష్టాలను మాత్రం గమనించలేకపోతున్నారు. వారికి తోడు డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు కూడా పాలపొడుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారని అనొచ్చు. కానీ వీటితో భవిష్యత్లో పిల్లలకు వచ్చే వ్యాధులు, లోపాలను సూ చించలేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా తల్లులు, వైద్య విధానంలో కూడా మార్పు రావాలని ఆశిద్దాం.
గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగంగా తల్లి, బిడ్డకు పాలు పట్టడం సహజం. కానీ పట్ట ణాల్లోకి వచ్చే సరికి రైళ్లు, బస్సుల్లో, బహి రంగ ప్రదేశాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలిచ్చే సమయంలో కొన్ని విష పు చూపుల మధ్య పసిబిడ్డ ఏడ్చిన వెంటనే పాలుపట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి వారిలో మార్పు రావాలి. బిడ్డకు పాలు పట్టే సమయంలో తన తల్లిగానే ప్రతి ఒక్కరూ భావించే గుణం రావాలి. తల్లీబిడ్డకు బహిరంగ ప్రదేశాల్లో పాలుపట్టే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్ర భుత్వాలపై ఉన్నది. ప్రత్యేకంగా పబ్లిక్ బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
తల్లిపాలు శిశువుకి అమృతం లాంటివి. పాలల్లో సంపూర్ణ పౌష్టికాహారం ఉంటుంది. తల్లికి, బిడ్డకు ఆరోగ్యవంతమైనవి. బిడ్డకు తల్లిపాలు కావాల్సిన ఉష్ణోగ్రతలో ఉన్నాయి. ఇవి వ్యాధి నిరోధక టీకాగా పనిచేస్తాయి. ము ర్రుపాలలో శిశువుకు కావాల్సిన ఖనిజాలు, మాంసకృతులు, విటమిన్-ఏ సమృద్ధిగా ఉం టాయి. అలాగే పేగుల నుంచి విసర్జకాలను తొలగించడానికి, అలర్జీ రాకుండా నిరోధించడానికి ముర్రుపాలు తోడ్పడుతాయి. ఆరు నెలల దాకా తల్లిపాలు తాగడంతో జీవ సం బంధ వ్యాధులు ఉండవు. అంతేగాక జీర్ణకోశ నిరోధక శక్తి పెరిగి మలబద్ధక సమస్య ఉండదు. అస్తమా, చర్మవ్యాధి, లుకేమియా వంటి వ్యాధులు దరిచేరవు. పిల్లలు పెద్దయ్యాక అధిక రక్తపోటు గాని, మధుమేహ వ్యాధులు రాకుండా ముర్రు పాలు కాపాడుతాయని, అలాగే దృష్టిలోపం రాకుండా నివారిస్తాయి. అంతేగాక తల్లిపాలతో పోషకాహార లోపాలు, శిశు మరణాలు తగ్గే అవకాశం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు.
పిల్లలకు పాలు పట్టడంతో తల్లులకు ఎంతో ప్రయోజనం చేకూ రుతుంది. ప్రసూతి సమయంలో బరువు తగ్గేందుకు దోహద పడతాయి. అలాగే మానసిక ఒత్తిడి, రక్తస్రావం తగ్గు తుంది. పిల్లలకు 6 నెలలపాటు పాలు పట్టడంతో తల్లులకు రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటి వ్యాధులు రావని వైద్యులు వివరి స్తున్నారు. ఇప్పటికైనా నేటి తల్లులు పాశ్చాత్య ధోరణిని వదిలి పుట్టిన పిల్లలకు పాలు పట్టే సంస్కృతిని పాటించాలని కోరుకుందాం.