తిమ్మాజిపేట : తిమ్మాజిపేట మండల కేంద్రంలోని టీజీబీసీఎల్ స్టాక్ పాయింట్ ( TGBCL Stock Point) లో హమాలీలుగా నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం మద్యం స్టాక్ పాయింట్ ఎదుట యువకులు ఆందోళన నిర్వహించారు. మండలంలో వివిధ గ్రామాలకు చెందిన అనేక మంది నిరుద్యోగులు ఉన్నారని, ప్రతి గ్రామానికి ఇద్దరు చొప్పున హమాలీలుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్టాక్ పాయింట్ ప్రస్తుతం పని చేస్తున్న వారిపై పని భారం ఎక్కువగా ఉందని, హమాలీలుగా చాలామంది అవసరం ఉందని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే అవకాశం కల్పించాలన్నారు. దీని ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా స్టాక్ పాయింట్ డీఎం అబ్దుల్ వాజిబ్ నకు వినతిపత్రాన్ని అందజేశారు. హమాలీలుగా తీసుకునేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఆందోళనలో దానం బాలరాజ్, షేక్ ముబారక్, యువకులు పాల్గొన్నారు.