ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అవమానం పాలయ్యామని కృంగిపోలేదు.. కుటుంబ పరిస్థితులు చూసి మానసిక వొత్తిడికి గురి కాలేదు… ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని ఆందోళన చెందలేదు.. కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి అన్నితానై అష్టకష్టాలు పడింది.. శ్రమతో అలసటను మరిచి మొత్తం కుటుంబాన్ని ఒంటి చేత్తో నడిపింది. కూతుళ్లను బాగా చదివించి ఉన్నతస్థానంలో నిలిచేలా చేసి మహిళాలోకానికే ఆదర్శంగా నిలిచిన నల్లమలకు చెందిన చంద్రకళ కుటుంబ నేపథ్యంపై ప్రత్యేక కథనం..
అమ్రాబాద్‌లో పసుపు గిర్నీ నడుపుతున్న చంద్రకళ
అమ్రాబాద్, సెప్టెంబర్ 23 : అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల కేంద్రంలో నివసిస్తున్న గంజి చంద్రకళ భర్త గంజి దేవేందర్ దంపతులు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు భార్గవి, లిఖిత, మాధురి. వీరిలో పెద్దకూతురు చిన్ననాటి నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ సాయంతో ఇంటర్ విద్యను పూర్తి చేసింది. అనంతరం నీట్లో ర్యాంకు సాధించి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే గుంతకల్ కళాశాలలో ఆయుర్వేదంలో వైద్య విద్య కొనసాగిస్తూ ప్రస్తుతం చివరి సంవత్సరంలో ఉన్నది.
త్వరలోనే ఆయుర్వేద డాక్టర్‌గా పట్టా అందుకోబోతున్నది. రెండో కూతురు లిఖిత అక్క అడుగు జాడలో నడుస్తూ తల్లి కష్టాలను చూస్తూ శ్రమనే ఆయుధంగా మలిచి జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని నిర్ణయించుకున్నది. తన కుటుంబానికి మంచి పేరు తేవాలని పట్టుదలతో చదివి ఇటీవల వెలువడిన వైద్య విద్యకు సంబంధించిన నీట్ ఫలితాల్లో 504 మార్కులు సాధించింది. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలలోనే ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉన్నది. లిఖిత సాధించిన మార్కులతో వీరి కుటుంబ పరిస్థితులు తెలుసుకున్న ప్రతి ఒక్కరూ వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. మూడో కూతురు మాధురి తన అక్కలతోపాటు తాను ఎంబీబీఎస్ సీటు సాధించాలని పట్టుదలతో హైదరాబాద్‌లో లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నది. ఇద్దరు అమ్మాయిలకు అచ్చంపేట నియోజకవర్గంలోని ఇచ్డియన్ ప్రైవేట్ పాఠశాల యూజమాన్యం వీరి కుటుంబ పరిస్థితిని తెలుసుకొని ఉచితంగా విద్యను అందించారు.
భర్తకు తోడుగా..
15 ఏండ్ల కిందట జరిగిన ఓ ప్రమాదంలో భర్త వెన్నెముకకు దెబ్బ తగిలి శరీరంలో నడుము కింది భాగం నుంచి పూర్తిగా చచ్చుబడిపోయి మంచానికే అంకితమయ్యాడు. సపర్యాలు చేస్తూ చంటి పిల్లలా భర్తను కాపాడుతూ వస్తున్నది. ఇంట్లో చిన్నపాటి కిరాణం, పిండి, కారం గిర్నీలను నడుపుతూ కుటుంబ పోషణను కొనసాగిస్తున్నది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి దాతలు అండగా నిలవాలని కోరుతున్నారు.
నా తండ్రి ఆవేదన చూసే..
నా తల్లి పడిన శ్రమ, తండ్రి పడుతున్న ఆవేదనను ఎప్పుడూ మర్చిపోను. నా జీవితాంతం తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. నేను పుట్టిన గడ్డకు సేవ చేస్తా. మా నాన్న పరిస్థితి చూసి ఆరోగ్యపరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితోనే వైద్య విద్యను ఎంచుకున్న.
– గంజి లిఖిత
దాతలు సహకరిస్తే..
ఈ ఏడాదితో నా వైద్య విద్యకోర్సు పూర్తవుతుంది. పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించిన నాకు పీజీ, ఎండీ చేసే అవకాశం వచ్చింది. కానీ కోర్సును పూర్తి చేయాలంటే రూ.లక్షలు ఖర్చవుతుంది. దాతలు సహకరిస్తే కోర్సు పూర్తి చేసి గ్రామీణ పాంతాల్లో ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని ఉంది.
– గంజి భార్గవి, వైద్య విద్యార్థిని
గర్వంగా.. సంతోషంగా ..
నేను పడ్డ కష్టానికి నా పిల్లలు ఇష్టపడి చదివారు. ఆయుర్వేదంలో, ఎంబీబీఎస్‌లో సీట్లు పొంది నా కష్టానికి ప్రతిఫలం అందించారు. సమాజంలో గౌరవం పేరు ప్రఖ్యాతలను సంపాదించి పెట్టారు. నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉన్నది.
– గంజి చంద్రకళ
కన్నీళ్లు పెట్టడం తప్పా ఏమీ చేయలేను..
నా భార్య 15 సంవత్సరాలుగా పడుతున్న కష్టం శ్రమ ఆవేదనను చూసి కన్నీళ్లు పెట్టడం తప్ప నేను ఏ సహాయం చేయలేకపోతున్న. అలాంటిది మా పిల్లలు ఇంటి పరిస్థితులను ఎదుర్కొని ఉన్నత చదువులు చదువుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
– గంజి, దేవేందర్
పోతుగంటి రాములు ఆయన కుమారుడు, జెడ్పీటీసీ భరత్ వీరి ఇంటికి చేరుకొని ఇద్దరినీ అభినందించి సన్మానించారు. లిఖిత వైద్య విద్యకు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూరుస్తామని ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. భర్త మంచానికే పరిమితమైనా ధైర్యం కోల్పోకుండా సమాజంలో మంచి, చెడులు అన్నీ ఎదుర్కొని నిలబడి తన కుటుంబానికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించి ఆదర్శంగా నిలిచింది.