మహబూబ్నగర్, జూన్ 18 : నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అసలే జూన్ నెల వచ్చిందంటే అన్ని వర్గాల ప్రజలు భయపడుతున్నారు. ఒక వైపు రైతులు పంటల పెట్టుబడి ఖర్చులు, మరో పక్క పిల్లల చదువుల కోసం ఫీజులు, బుక్కులు, పుస్తకాలు వగైరా ఇలా తడిసి మోపెడవుతున్న క్రమంలో నిత్యావసర ధరలు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పప్పు, చింతపండు, నూనె తదితర ధరలు ఆకాశనంటుతుండగా అందులో టమా ట కూడా వచ్చి చేరింది. టమాట ధర రూ.100కు చేరడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇక కూరగాయల ధరలు కూడా రూ.80 నుంచి వంద పలుకుతున్నాయి. పచ్చి మిర్చి రూ.100 నుంచి 120 పలుకుతున్నది. ఆకు కూరలు పది రూపాయలకు నాలుగైదు కట్టలకు మించి రావడం లేదు. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సైతం పది రూపాయలకు చిన్నకట్ట మాత్రమే ఇస్తుండడంతో ప్రజలు ఏం కొనాలి, ఏం తినాలని ఆందోళనకు గురవుతున్నారు.