గద్వాల టౌన్, జూన్ 7 : భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో నక్షత్రానికి .. ఒక్కో కార్తెకు.. రాశికి ప్రత్యేకత ఉంటుంది.. అందులో మృగశిరకు మరింత విశిష్టత ఉన్నది.. రోహిణి కార్తెతో రోళ్లు పగిలే ఎండలతో సతమతమైన జీవకోటికి మృగశిరం చల్లని కబురు చెబుతుంది.. ఈ కార్తెలోనే రుతుపవనాల ఆగమనం జరుగుతుంది.. ఈ కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అంటూ సాగు పనులు చేపడతారు.. అంతేగాక ఈ కార్తెలో చేపలు విరివిగా తినడం వల్ల అనేక రోగాలు నయం అవుతాయి.. అదే నమ్మకంతో కార్తెనాడు చేపమందును తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది.. అంతేగాక మృగశిర కార్తెకు పురాణాల్లో కూడా ఎంతో విశిష్టత ఉన్నది.. ఈ కార్తె గురించి భగవద్గీతలో.. పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉండడం విశేషం.
మృగశిర కార్తెను ప్రతి ఏడాది జూన్ మాసంలో జరుపుకొంటారు. సూర్యుడి మృగశిరంలోకి ప్రవేశంచడంతో మృగశిరకార్తెగా పిలుస్తారు. అంతేకాక మృగశిర నక్షత్రానికి చంద్రుడు 14 రోజులు సమీపంలో ఉంటాడు.. అందుకే మృగశిర అనే పేరు వచ్చింది. ఈ కార్తెలో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడం జరుగుతుంది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా ఉన్న ఎండలతో సతమతమైన జీవకోటికి చల్లని వాతావరణం ఈ కార్తె అందిస్తుంది. తొలకరి జల్లులు కురిసి పుడమి చల్లబడి సాగుకు అనుకూలంగా మారుతుంది. దీంతో రైతన్నలు ఏరువాక సాగు పండుగను ప్రారంభిస్తారు. ముందుగా వానలు రావడంతో కాలం కలిసొచ్చినట్లేనంటూ సంతోషంగా సాగును చేపడతారు.
మృగశిర కార్తెను మొదటి రోజున దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం అనే పేర్లతో పిలుస్తారు. ఈ రోజు బెల్లంలో ఇంగువను కలుపుకొని తింటారు. ఇది శరీరంలో ఊష్ణోగ్రతను ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల నమ్మకం.
మృగశిర కార్తెలో చేపలు తినడం మన పెద్దల నుంచి వస్తున్న ఆనవాయితీ. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో వేడి చల్లబడుతుంది. వేడిని పుట్టించేందుకు చేపలను తింటారు. అంతేకాక చేపలు తినడం కారణంగా ఉబ్బసం, అస్తమా రోగులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. అలాగే కొత్త నీరు వచ్చి చేరుతుంది. దీంతో రోగాలు వచ్చే అ వకాశం ఉండడంతో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. రోగాల నుంచి కాపాడుకుంటూ, రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే చేపలు తినాల్సిందేనని పెద్దలు చెప్తుంటారు. దీంతో చేపలకు యమ డిమాండ్ ఉంటుంది.
మృగశిక కార్తెను నడిగడ్డలో మరింత స్పెషల్గా జరుపుకొంటారు. కార్తె రాకను పెద్ద పండుగలా జరపుకొంటారు. మృగశిర కార్తె నాడు నల్లకోడి తినితిరాల్సేందేంటూ మాంసహార ప్రేమికులు ఎంత ధరైనా చెల్లించేందుకు పోటీ పడతారు. దీంతో నల్లకోళ్లకు డిమాండ్. ఒక్కో కోడి ధర రూ.పదిహేను వందల నుంచి రూ.2 వేలకుపైగా ధరలు పలుకుతున్నాయి. శాఖహారులు మామిడి పండ్ల రసం అట్లు తింటారు.