Eemani Shiva Nagi Reddy | కొల్లాపూర్, ఫిబ్రవరి 12: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపురం గ్రామంలోని శ్రీ భూనీల వెంకటేశ్వర ఆలయం కొలువుదీరింది. ఈ ఆలయం గోడలు, మండప స్తంభాలపై వేసిన రసాయన రంగులు ఆలయ ప్రాచీనతకు భంగం కలిగిస్తున్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెన్నెల సాహిత్య అకాడమీ అధ్యక్షులు ముచ్చర్ల దినకర్‌తో కలిసి ఆయన బుధవారం దేవుని తిర్మలాపురంలోని భూనీల వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు.
గుడి గర్భాలయం, అర్థమండపం, మహా మండపం గల 400 సంవత్సరాల చరిత్ర గల విజయనగర రాజుల కాలానికి చెందిన ఆలయంపై రకరకాల రసాయనిక రంగులు వేశారని ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. తద్వారా అలనాటి వాస్తు, శిల్ప వైభవానికి ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆలయానికి మునుపటి వైభవాన్ని తీసుకురావాలని ఆయన ఆలయ అధికారులకు, ధర్మకర్తలకు, పూజారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయాద్ నిర్మాణ స్థపతి భీమ్ రెడ్డి వెంకట్ రెడ్డి, అదే సంస్థకు చెందిన బడే సాయి కిరణ్ రెడ్డి, తెలుగు ఎల్లయ్య పాల్గొన్నారు.