ఇటిక్యాల, జనవరి 17 : మండలంలోని వావిలాలలో శివాంజనేయస్వామి జాతర సందర్భంగా పలు రకాల పోటీలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన వ్యగ్తిగత బల ప్రదర్శనలో భాగంగా ఇసుక సంచులను ఎత్తుట, గుబ్బలగుండు, దొబ్బుడు గుండు, సందెరాయి పోటీలను నిర్వహించారు. 160 కేజీల ఇసుక సంచి ఎత్తే పోటీలో దేవదుర్గకు చెందిన పరశురామ్నాయక్ ప్రథమ బహుమతి రూ.5వేలు, ఎరిగెర గ్రామానికి చెందిన శంకరప్ప ద్వితీయ బహుమతి రూ.4వేలు గెలుచుకొన్నారు.
అలాగే గుబ్బలగుండు ఎత్తుడు పోటీల్లో సోమలగూడూరు శివ ప్రథమస్థానంలో నిలిచి రూ.5వేలు, అదే గ్రామానికి చెందిన గజ్జన్న ద్వితీయ బహుమతి రూ.4వేలు, తాండ్రపాడు శ్రీనివాసులు తృతీయ బహుమతి రూ.3వేలను గెలుచుకొన్నారు. అలాగే 120 కిలోల సందెరాయి ఎత్తుడు పోటీల్లో మలమద్ది గ్రామానికి చెందిన నిజాం ప్రథమస్థానంలో నిలిచి రూ.6వేలు, బల్గెరకు చెందిన హన్మంతు ద్వితీయ బహుమతి రూ.4వేలు, మేడికొండ రాజు తృతీయ బహుమతి రూ.3వేలు, గుంజపల్లె గ్రామానికి చెందిన ఆంజనేయులు నాలుగో బహుమతి రూ.2వేలను గెలుచుకొన్నారు. అలాగే దొబ్బుడు గుండు ఎత్తుడు పోటీల్లో వెంకటాపురం స్టేజీకి చెందిన లాల్ ప్రథమస్థానం, అఫ్జల్ ద్వితీయ బహుమతి అందుకున్నారు.