తిమ్మాజిపేట/ గద్వాల / మక్తల్ / దేవరకద్ర / అలంపూర్ / భూత్పూర్/ అచ్చంపేట రూరల్ / బిజినపల్లి / లింగాల : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ( Ambedka Jayathi ) ఉత్సవాలు సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. వాడవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ర్యాలీలు నిర్వహించి జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు జయంతి వేడుకల్లో పాల్గొని బాబా సాహెబ్ అంబేద్కర్ సేవలను కొనియాడారు.
తిమ్మాజిపేటలో..
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి( MLA Rajesh Reddy) అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ, స్వేచ్ఛ స్వాతంత్రం అందించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. ప్రతి ఒక్కరు ఆయన సూచించిన మార్గంలో నడవాలి అన్నారు.
జోగులాంబ గద్వాలలో..
గద్వాల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ ( Colletor Santhosh) పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సభను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవభారత నిర్మాణంలో అంబేద్కర్ పోషించిన పాత్ర విశేషమైందన్నారు.
సమాజంలో అంటరానితనం, బానిసత్వం, అస్పృశ్యతల నిర్మూలనకు, వివక్ష పై అలుపెరుగని పోరాటం చేసి, అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందని అన్నారు. అందరూ సమానంగా, ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు, రిజర్వేషన్లు, అన్ని వెనుకబడిన వర్గాలకు సమానత్వం రావడానికి ముఖ్య కారణం అంబేద్కర్ పోరాటమే అని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, ఏవో నరేందర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ బాబు, ఎస్సీ సంక్షేమ అధికారి సరోజ, జిల్లా అధికారులు, కుల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
మక్తల్‌లో..
మక్తల్ : మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి( Chittem Rammohan Reddy) సోమవారం అంబేద్కర్‌కు ఘన నివాళి అర్పించారు. మక్తల్ పట్టణ అధ్యక్షులు చిన్న హనుమంతు అధ్యక్షతన జరిగిన జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగానికి ప్రధాన శిల్పిగా మారడం ఎంతో గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అని పేర్కొన్నారు.
దేవరకద్రలో..
దేవరకద్ర : మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో , మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ దొబ్బలి అంజనేయులు, మాజీ ఎంపీటీసీ ఉష్కిల వెంకట రాములు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు జెట్టి నర్సింహా రెడ్డి,భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,చిన్నారెడ్డి, చెన్నప్ప,,ఆంజనేయులు,, ఎల్లప్ప,జగన్, యుగంధర్ రెడ్డి, చలమారెడ్డి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
అలంపూర్‌లో..
అలంపూర్ : అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు ( MLA Vijayudu ) అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ అనేక దేశాలు పర్యటించి అక్కడి రాజ్యాంగాలను పరిశోధించి ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించారని అన్నారు. దళితులకు రిజర్వేషన్ కల్పన వంటి విప్లవాత్మక అంశాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
భూత్పూర్లో..
భూత్పూర్ : భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ( MLA Madhusudan Reddy ) అన్నారు. సోమవారం బీఆర్ అంబేద్కర్ జయంతిని సందర్భంగా పట్టణ పరిధిలోని చౌరస్తా కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్‌ను అగౌర పరిచే విధంగా మాట్లాడడం దారుణమని అన్నారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంబేద్కర్ విగ్రహాలను పాలాభిషేకాలు చేసి గొప్పలు చెప్పడం సరికాదని అన్నారు. అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ విధానాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. తహసీల్దార్ జయలక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నూరు నజీర్, ఏవో మురళీధర్, సీఈవో రత్నయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కదిరి శేఖర్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయకులు బోరింగ్ నర్సింలు, గడ్డం రాములు, మండి వెంకటయ్య, గడ్డం ప్రేమ్ కుమార్, బాబు, గడ్డం ఎల్లప్ప పాల్గొన్నారు.
అచ్చంపేట రూరల్..
అచ్చంపేట రూరల్ : అచ్చంపేటలో సీపీఎం పార్టీ కార్యాలయంలో సీపీఎం( CPM) సీనియర్ నాయకులు ఎ రాములు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు , ఈ కార్యక్రమానికి వర్థం సైదులు అధ్యక్షత వహించగా నాయకులు సయ్యద్, నిర్మల, శివలీల, సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.
బిజినపల్లిలో.
బిజినపల్లి : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ( MLA Rajesh Reddy) అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల అధ్యక్షులు, మండల నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
లింగాలలో..
లింగాల : అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత, దళిత బాంధవుడు అంబేద్కర్ జయంతి వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సింగిల్ విండో చైర్మన్ హనుమంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు . బడుగులు వెనుకబాటుతనానికి గురికాకుండా ఉండేందుకు రాజ్యాంగంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించారని అన్నారు. అంబటిపల్లి ప్రభుత్వ కార్యాలయాలలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు బాలస్వామి, నాయకులు బాలరాజు, వెంకటేష్, ఇందిరమ్మ, విజయలక్ష్మి, శివ, ముక్తార్, తదితరులు పాల్గొన్నారు.