విద్యార్థులకు సరళతరంగా.. మైండ్‌లో నిలిచే రీతిలో బోధన చేయడానికి ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. ఇందుకోసం సర్కార్ బడుల్లో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) మేళాను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో కొన్ని మండలాల్లో ప్రారంభించగా.. మరికొన్ని చోట్ల సన్నాహాలుచేస్తున్నారు. వినడం, చూడడం, ప్రత్యక్షంగా పాల్గొనడంతో విద్యార్థులు ఎక్కువగా అవగాహన పొందుతారని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అందుకే ఆధునిక పద్ధతిలో బోధనోపకరణాలతో పాఠాల బోధనతో వేగవంతమైన అభ్యాసనానికి తోడ్పాటునిస్తున్నారు. ఇలా మండల, జిల్లా, రాష్ట్రస్థాయికి టీఎల్ఎం ప్రదర్శనను నిర్వహిస్తారు. వీటి నిర్వహణకు కాంప్లెక్స్ స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహించి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.
– వనపర్తి టౌన్, డిసెంబర్ 29
ప్రదర్శనల ఎంపిక విధానం..
మొదటగా పాఠశాల స్థాయిలో రూపొందించిన, తయారు చేసిన ప్రదర్శనను డిసెంబర్ చివరి వారంలోగా మండల స్థాయిల్లో టీఎల్ఎం ప్రదర్శన నిర్వహించాలి. జనవరి మొదటి వారం నుంచి సంక్రాంతి సెలవుల్లోగా జిల్లాస్థాయి మేళా నిర్వహించి రాష్ట్రస్థాయి మేళాకు ఎంపిక చేస్తారు. మండల మేళాలో ప్రతి సబ్జెక్ నుంచి 5 టీఎల్ఎంలను జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో ఒక్కో సబ్జెక్ట్ నుంచి 5 టీఎల్ఎంల ఎగ్జిబిట్ ప్రదర్శిస్తారు. జిల్లాస్థాయిలో ప్రదర్శించిన ఎగ్జిబిట్లను ప్రతి సబ్జెక్టుకు పది చొప్పున రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు.
ప్రతి స్థాయిలో విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రాథమికస్థాయిలో పిల్లలకు ప్రత్యక్ష అనుభవం, తక్కువ సమయంలో ఎక్కువ విషయాలపై అవగాహన పెంచుకోవడం, తరగతి గదిలో బహుళ బోధన, కృత్యాల నిర్వహణ తదితర ప్రణాళికల ద్వారా ప్రదర్శనలను నిర్వహిస్తారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా చాలామంది ఉపాధ్యాయులు సామగ్రిని సొంత ఖర్చులతో రూపొందించుకోవడం అభినందనీయం. ఉపయోగించిన సామగ్రికి 10, తయారుచేసిన విధానానికి 10, అభ్యాసన సామర్థ్యాలకు 10, బహుళ ప్రయోజనాలకు 10 మార్కుల చొప్పున కేటాయించి ఉత్తమ టీఎల్ఎంను ఎంపిక చేస్తారు.
వనపర్తి టౌన్, డిసెంబర్ 29 : బోధన అభ్యాసన ప్రక్రియను సరళతరం, పటిష్టం చేసి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా చేయడంతోపాటు అనుమానాలను తొలగించి ఎక్కువ కాలం మదిలో గుర్తుంచుకునేలా బోధించేందుకు ఉపాధ్యాయులు టీఎల్ఎం మేళాకు సిద్ధమయ్యారు. విద్యార్థులు ప్రదర్శనల ద్వారా ఎక్కువ జ్ఞానం పొంది గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. చూడడం ద్వారా 83 శాతం, వినడం ద్వారా 11 శాతం, రుచి ద్వారా 1 శాతం, స్పర్శ ద్వారా 1.5 శాతం, వాసన ద్వారా 3.5 శాతం జ్ఞానాన్ని విద్యార్థులు పొందుతారని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వినడం, చూడడం, ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా విద్యార్థులు ఎక్కువగా అవగాహన చేసుకొని మదిలో భద్రపర్చుకునే అవకాశం ఉంటుంది. మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధనలో ఎల్లప్పుడూ మార్పు చేసుకుంటూ ఎంతో ఆకర్షణీయంగా నో కాస్ట్.., లో కాస్ట్‌తో ప్రదర్శనలను సిద్ధం చేశారు.
సంప్రదాయ బోధనకు స్వస్తి పలికి ఆధునిక పద్ధతిలో బోధనోపకరణాలతో పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయ లోకం నడుం బిగించింది. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల నుంచి ఒక్కో సబ్జెక్టుకు ఒకటి చొప్పున మేళా ప్రదర్శనకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో వనపర్తి మండలానికి సంబంధించిన టీఎల్ఎం మేళాను శుక్రవారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐదు కాంప్లెక్స్‌లో 70 పాఠశాలల నుంచి 280కి పైగా ప్రదర్శనలు రానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ బడుల్లో మెరుగైన, నాణ్యవంతమైన బోధనను అందించేందుకు ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిల్లో టీఎల్ఎం మేళా నిర్వహించేందుకు ఉపాధ్యాయులు సన్నద్ధమవుతున్నారు.
విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం అమల్లోకి వచ్చాక విద్యార్థుల్లో ఆలోచనలు, సృజనాత్మకతను పెంపొందించడంతోపాటు వినూత్న బోధన చేపట్టేందుకు టీఎల్ఎం మేళా నిర్వహిస్తున్నారు. బోధన అభ్యాసన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న పిల్లలకు విషయ పరిజ్ఞానాన్ని పెంచడానికి, స్వీయ అనుభవం కలిగించడానికి, పరిపూర్ణమైన విషయ అవగాహన కల్పన ముఖ్య ఉద్దేశంతో పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో ఈ మేళా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఎంఈవోలు, సెక్టోరియల్ అధికారులతో ఈ నెల 23న డీఈవో కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కాంప్లెక్స్ పరిధిలో హెచ్ఎంలు సమావేశాలను నిర్వహించారు.
తెలుగు, గణితం, ఆంగ్లం, పరిసరాల విజ్ఞానానికి సంబంధించి ప్రతి పాఠశాల నుంచి నాలుగు ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఏకోపాధ్యాయుడు ఉన్న పాఠశాలలో ఒక సబ్జెక్టుకు ఒక్కటి చొప్పున మూడు లేదా నాలుగు టీఎల్ఎంను తీసుకురావాలి. ఇదిలా ఉండగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు మండలాల్లో టీఎల్ఎం మేళా కొనసాగుతున్నది. కొన్ని మండలాల్లో నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
టీఎల్ఎం నిర్వహణ కమిటీలు..
టీఎల్ఎం నిర్వహణ కోసం కాంప్లెక్స్ స్థాయిల్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించి కమిటీలను ఏర్పాటు చేశారు.
అవసరాల కమిటీ : తాగునీరు, భోజనాలు, కుర్చీలు, బల్లాలు, టెంట్, బ్యానర్లు ఇతర సామగ్రి సమకూర్చాల్సి ఉంటుంది.
ఆహ్వాన కమిటీ : ఈ కమిటీలో ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఉంటారు.
నిర్వహణ కమిటీ : సబ్జెక్టుల వారీగా సామగ్రిని అమర్చడం, ఉపాధ్యాయులందరూ సహకరించడం.
న్యాయ నిర్ణేతల కమిటీ : ఒక్కో సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున రీసోర్స్ సభ్యులు ఉంటారు.
డాక్యుమెంటేషన్ కమిటీ : డిజిటల్ డాక్యుమెంటేషన్ కోసం నివేదిక తయారు చేయాల్సి ఉంటుంది.
నమోదు కమిటీ : పాఠశాలల నుంచి వచ్చిన ప్రదర్శనల వివరాలను నమోదు చేస్తారు.