మక్తల్ : మండలంలోని ఖానాపూరం( Khanapuram) ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను ( Teacher shortage ) తీర్చాలని కోరుతూ విద్యార్థులు రాస్తారోకోను నిర్వహించారు. అనుగొండ రోడ్డుపై విద్యార్థులు రాస్తారోకో ( Rastaroko ) చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
పాఠశాలలో 160 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లు ఉండగా వీరిలో ఒకరు ఉన్నత విద్యకోసం సెలవు పై , మరొకరు అనారోగ్య సమస్యతో డిప్యూటేషన్‌పై ఇతర జిల్లాకు వెళ్లడంతో ఒక్కరే పనిచేస్తున్నారు. మరో ఇద్దరిని డిప్యూటేషన్‌పై పాఠశాలకు పంపినప్పటికీ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరిపోవడం లేదంటూ మంది విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలవపేతం చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలు ఇవ్వడమే కాని ఉపాధ్యాయులను నియమించడంలో ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. 160 మంది విద్యార్థులకు 5గురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాల్సి ఉండగా కేవలం ముగ్గురితోనే సరిపుచ్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ని క్లస్టర్ హెడ్మాస్టర్ వెంకటయ్య గౌడ్ రాస్తారోకో వద్దకు చేరుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పడంతో రాస్తారోకోను విరమించారు.