శ్రీశైలం ఏప్రిల్ 1: శ్రీశైలక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంబరానంటుతున్నాయి. శుక్రవారం ఉదయం స్వామిఅమ్మవార్ల విశేష పూజలు జరిగాయి. స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధన, జపానుష్ఠానాలు, రుద్రహోమం, పారాయణాలు జరిపించారు. అనంతరం భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఉత్సవమూర్తులకు వైభవంగా ప్రభోత్సవం జరిగింది. ప్రభను వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం నుంచి స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలతో గంగాధర మండపం వద్దకు తీసుకొచ్చి ప్రభపై అదిష్టింపజేసి అర్చకులచే శాస్ర్తోక్త పూజలు నిర్వహించారు. వేల సంఖ్యలో ఉన్న కన్నడ భక్తులు ప్రభను తిలకించేందుకు పురువీధుల్లోకి తరలివచ్చారు. కన్నడ భక్తజనం భ్రమరాంబ మల్లికార్జునస్వామిని కీర్తిస్తూ ప్రభోత్సవంలో పాల్గొన్నారు. చైత్ర శుద్ధ పాఢ్యమి రోజున స్వామిఅమ్మవార్లు రథోత్సవంలో క్షేత్రవీధుల్లో విహరించేందుకు ముందుగా చండీశ్వరుడు వచ్చి క్షేత్ర పర్యటన చేసివేళ్లే ఆనవాయితీగా ప్రభోత్సవం నిర్వహిస్తారని పురాణాల్లో చెప్పబడింది. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ దంపతులు పాల్గొన్నారు.
ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్పమూర్తులను నందివాహనంపై ఆసీనులగావించి షోడషొపచార పూజలు నిర్వహించారు. నందివాహనంపై అధిరోహించిన స్వామిఅమ్మవార్లను దర్శించుకోవడం వల్ల చేపట్టిన పనుల విజయం, భోగభాగ్యాలు కలుగుతాయని ఇతిహాసాలు వివరిస్తున్నాయి.
అష్టాదశశక్తి పీఠాల్లో ఆరవదైన శ్రీశైల భ్రమరాంబ అమ్మవారు మహాసరస్వతి అలంకరణలో భక్తులను కటాక్షించింది. చతుర్భుజాలు కలిగిన అమ్మవారు వీణ, అక్షమాల, పుస్తకాన్ని ధరించి భక్తాధులకు దర్శనమిచ్చింది. అమ్మవారిని దర్శించుకోవడంతో అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. వాహన పూజల అనంతరం స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రధాన రాజగోపురం ద్వారా గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నందిమండపం నుంచి బయలు వీరభధ్రస్వామి వరకు జరిగిన గ్రామోత్సవం కనులపండువగా సాగింది. గ్రామోత్సవంలో కోలాటం, జానపద పగటి వేషాలు, బుట్టబొమ్మలు, గొరువ నృత్యం, తప్పెట చిందులు, కర్ణాటక జాంజ్, కొమ్మువాయిద్యం, జానపదడోలు, నందికోలసేవ, కంచుడోలు విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఈవో లవన్న, ఏసీ నటరాజ్, ఈఈ మురళీబాలకృష్ణ, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకుడు అనిల్‌కుమార్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి, ఏఈవో హరిదాస్, డీఈలు శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న, పర్యావేక్షకులు శ్రీహరి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రసిద్ధ జ్యోతిర్లింగ మహా శక్తిపీఠం కొలువైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి క్షేత్రాన్ని భూమండలానికే నాభిస్థానంగా సూచిస్తూ స్వామిఅమ్మవార్ల సన్నిధిలో నూతన సంవత్సరాది పంచాంగ పఠన కార్యక్రమానికి ప్రాధాన్యత ఉన్నది. ఉగాది మహోత్సవాల్లో భాగంగా స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి పండిత శ్రీబుట్టే వీరభద్ర దైవజ్ఞశర్మచే పంచాంగ శ్రవణం, పంచాంగ వితరణ, పండిత సత్కారాలు జరుగుతాయి. అదేవిధంగా సాయంత్రం 4గంటలకు రథాంగపూజ, రథాంగ హోమం, రథాంగ సాత్వికబలి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. రథోత్సవంలో భ్రమరాంబదేవి రాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు వేదపండితులు తెలిపారు.