హబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జనవరి 13 : చదువుతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి సంధ్యారాణి అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాష్ట్ర సదనం, బాలసదన్లను తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో జడ్జి సంధ్యారాణి మాట్లాడుతూ బాలికలు చదువుపై దృష్టి సారించి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. విద్యతోనే పేదరికాన్ని రూపుమాపవచ్చన్నారు.
మా యమాటలు చెప్పే వ్యక్తులతో మోసపోవద్దన్నారు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తే తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. బాలికల చదువుకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసుశాఖ తగిన భద్రత కల్పిస్తున్నదని తెలిపారు. ఆపద సమయంలో డయల్ 100కు సమాచారం ఇస్తే పోలీసులు రక్షణ కల్పిస్తారన్నారు. అలాగే విద్యార్థినులను ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే ఆకతాయిలను కట్టడి చేసేందుకు షీ బృందాలు పని చేస్తున్నాయని, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనవసరంగా ఇతరుల మాయమాటలకు మోసపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని, చదువుపై దృష్టి సారించి జీవితంలో ఉన్నతంగా రాణించి తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని తెలిపారు. అంతకుముందు షీటీం కళాబృందం మహిళల భద్రతపై పాటలు పాడి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బాలసదన్ సూపరింటెండెంట్ యాదమ్మ, డీసీపీవో నర్మద, జేజేబీ సభ్యులు గ్రేస్, గిరిజ, సీడీపీవో లక్ష్మి, షీటీం సభ్యులు రాములు, నాగరాజు, పీఎల్వీ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.