వనపర్తి టౌన్, అక్టోబర్ 22 : వనపర్తి జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మంగళవారం కళాశాల విద్యార్థులు కదంతొక్కారు. వనపర్తి, గోపాల్పేట ప్రదాన రహదారిపై 4గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ జేఎన్టీయూ కొత్త భవనాలు లేక అద్దె భవనంలోనే కొనసాగుతున్నదని, తరగతుల కొరత, ల్యాబ్‌లు, లైబ్రరీ, కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పలుమార్లు వీసీ, రిజిస్ట్ర ర్ల దృష్టికి తీసుకెళ్లి ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికల తాత్కాలిక హాస్టల్లో కనీస వసతులు లేవని, టాయిలెట్స్, వాష్‌రూమ్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. విద్యార్థు లు సమస్యలపై ప్రశ్నిస్తే ప్రాక్టికల్స్‌లో మార్కులు తగ్గిస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీవో పద్మావతి, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను శాంతింపజేసి ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్‌తో ఫోన్లో మాట్లాడి సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన విరమించారు. అనంతరం కళాశాలలోని హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు.
బీఆర్ఎస్వీ నాయకుల మద్దతు
జేఎన్టీయూ సమస్యలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులకు బీఆర్ఎస్వీ నాయకులు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిందని బీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ హేమంత్, పట్ట ణ, మండల అధ్యక్షులు గిరి, రాములు అన్నా రు. కళాశాల యాజమాన్యం విద్యార్థులకు ఇచ్చిన హామీలను వారం రోజుల్లో పరిష్కరించకపోతే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అదేవిధంగా బీజేపీతోపాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.