మక్తల్ : మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ( Schools ) అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఏబీవీపీ ( ABVP ) నాయకులు మండల విద్యాధికారి కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వినయ్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై వారం అవుతున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో అసంపూర్తి గదులే దర్శనమిస్తున్నాయని ఆరోపించారు.
ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పడమే తప్పా ఆచరణలో మాత్రం శూన్యమని అన్నారు. మక్తల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆదరణ పెరుగుతున్నప్పటికీ, అదనపు గదులు, డైనింగ్ హాల్, మూత్రశాలలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
సంబంధిత విద్యాధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వ పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న అదనపు గదుల నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఏబీవీపీ నాయకులు నవీన్, నిఖిల్, సాయిరాం, సందీప్, నాని, నిహాల్ తదితరులు ఉన్నారు.