వనపర్తి, మే 17 : ప్రజలను చైతన్యం చేయడానికి కవులు నిత్యం చైతన్యపరులుగా ఉంటారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మాజీ మంత్రి స్వగృహంలో వనపట్ల సుబ్బయ్య, సంగిశెట్టి శ్రీనివాస్‌లు రచించిన ధిక్కార కవితా సంపుటిని నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలను చైతన్యవంతులను చేయడంలో కవుల పాత్ర ముఖ్యమైనదన్నారు. బ్రిటీష్ పాలన మొదలు నేటి వరకు కవుల రచనలే ఉద్యమాలకు ఊపిరిని అందించాయన్నారు. కవుల రచనలు ఆహ్లాదాన్నివ్వడంతోపాటు చైతన్యాన్ని నింపుతాయన్నారు.
మహానుభావుల చరిత్ర, వారు అనుసరించిన స్ఫూర్తిదాయక విధానాలను వెలుగులోకి తేవడంతో పాటు ప్రజలకు నైతికవిలువలను అందించే సత్తా వారిలో ఉంటుందన్నారు. వనపట్ల సుబ్బయ్య, శ్రీనివాసులు అదే కోవకు చెందినవారన్నారు. పుస్తక పఠనం వల్ల విజ్ఞానం పెరగడంతో పాటు పదిమందికి ఆదర్శంగా నిలిచే నిర్ణయాలు తీసుకోగలుగుతామన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సమాజ విశ్లేషకుడు టెలిఫోన్ బలరాం, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కుమార్, సురేందర్, రాము, నర్సింహ, బాబూనాయక్ తదితరులు పాల్గొన్నారు.