మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబర్ 10 : పాలమూరు విశ్వవిద్యాలయం.. ఆచార్యులు లేక వెలవెలబోతున్నది. బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నా.. వాటి భర్తీకి ప్రజాపాలన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ, ఔట్ సోర్సింగ్ సిబ్బందితోనే నెటుకొస్తుండడంతో ఉన్నత విద్యలో నాణ్యత కొరవడుతున్నది. మే 21వ తేదీన పీయూ వైస్ చాన్స్‌లర్ పదవి గడువు ముసిగింది. ఈ క్రమంలో ఇన్చార్జి వీసీగా రాష్ట్ర ప్రణాళికా విభాగం ప్రిన్సిప ల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్(ఐఏఎస్)ను నియమించారు. అయితే, నాలుగు నెలలు గా ఆయన ఒక్కరోజు కూడా వర్సిటీకి రాలేదు.
ప్రభుత్వ శాఖల పనుల నిర్వహణలో తీరిక లేకపోవడంతో ఈ సమస్య ఎదురవుతున్నట్లు తెలుస్తున్నది. చిన్న సంతకం అ వసరమైనా, ప్రతిపాదనల ఆమోదానికైనా పీయూ సిబ్బంది హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తున్నది. యూనివర్సిటీలో అత్యంత కీలకమైన వీసీ పోస్ట్‌కు నాలుగు నెలలుగా రె గ్యులర్ వ్యక్తి లేకపోవడంతో పరిపాలనాపరమైన విషయాల్లో వేగవంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. దీంతో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిగో.. అదిగో వీసీ వస్తున్నారని ప్రభుత్వం ఊరడింపు ప్రకటనతోనే సరిపుచ్చుతున్నది.
పీయూ 6వ వీసీగా మే 22, 2021న ప్రొఫెసర్ ఎల్బీ లక్ష్మీకాంత్‌రాథోడ్ బాధ్యతలు స్వీకరించారు. మూడేండ్ల పదవీకాలం ఈ ఏడాది మే 21న ముగిసింది. అయి తే, ఆయన గడువు కంటే ముందే కొత్త వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచే కసరత్తు చేపట్టింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో 159 దరఖాస్తులు రాగా.. అభ్యర్థుల గురించి ఇంటెలిజెన్స్ వర్గాల తో ప్రభుత్వం సమాచారాన్ని సేకరించింది. మే నెలాఖరు నాటికి కొత్త వీసీలను నియమిస్తామని సర్కారు ప్రకటించింది. యూనివర్సిటీ పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీ నామినీ.. ఇలా ముగ్గురు సభ్యులుగా ఈ నెల 3వ తేదీన దరఖాస్తుదారుల బయోడేటాలను సెర్చ్ కమిటీ పరిశీలించి.. వీసీ నియామకానికి మూడేసి పేర్లు సూ చించింది. అన్వేషణ పూర్తయి వారం గడుస్తున్నా.. నిర్ణయం తీసుకోవడంలో ప్రభు త్వం జాప్యం చేస్తున్నది.
పీయూలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పలు రకాలైన డిమాండ్లు చేస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ పేరిట వసూలు చేస్తున్న అధిక ఫీజులను తగ్గించాలి. వాటిని రెగ్యులర్ కోర్సులుగా మార్చాలి. అదనపు తరగతి గదులు (ఈవీఎస్, తెలుగు, ఎంసీఏ) నిర్మించాలి. ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్తో సంబంధం లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వాలి. అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి. రిక్వెస్ట్ బస్టాప్ ఏర్పాటు చేయాలి. లా, ఇంజినీరింగ్ కళాశాలలను పీయూలోనే కొనసాగించాలి. ఏటా కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలి. బాలికల వసతి గృహాలు అందుబాటులోకి తీసుకురావాలి. బోధనేత ర సిబ్బందికి 12 శాతం వేతన పెంపు చేపట్టాలి. వీసీ లేకపోవడంతో ఇలాంటి అనేక రకాలైన విధానపరమైన, అభివృద్ధి పనుల నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నది. సమస్యలు పరిష్కారం కావడం లేదు.
యూనివర్సిటీలో అన్ని విభాగాల్లో కలిపి 95 మంది ఆచార్యులకుగానూ 21 మం ది మాత్రమే ఉన్నారు. 13 ఆచార్యులు, 20 సహ ఆచార్యులు, 41 సహాయ ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు పీయూకు అనుబంధంగా ఉన్న జో గుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలోని పీజీ సెంటర్లలో కూడా ఆచార్యుల పోస్టులను భర్తీ చేయడం లేదు. పీయూలో రూ.8 కోట్లకు పైగా వెచ్చించి సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేసినా.. అథ్లెటిక్ కోచ్ లేకపోవడంతో వృథాగా మారింది.
పీయూకు న్యాక్ ‘బి’ గ్రేడ్ గుర్తింపు ఉండగా.. నవంబర్ 2023లోనే కాలపరిమితి ముగిసింది. మళ్లీ గుర్తింపు కోసం పీయూ ఇటీవల న్యాక్ కమిటీకి సెల్ఫ్ స్టడీ రి పోర్ట్ (ఎస్ఎస్ఆర్) సమర్పించింది. దీంతో త్వరలోనే న్యాక్ బృందం పర్యటించనున్నది. ఈ క్రమంలో పీయూకి వీసీ లేరు. న్యాక్ గ్రేడ్ కేటాయించేందుకు సిలబస్, బోధన, పరిశోధనలు, మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న ప్రోత్సాహం, పరిపాలన, ఉత్తమ విధానాల అమలు తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తా రు. బోధన సిబ్బంది కూడా తక్కువగా ఉండడంతో న్యాక్ ఏ స్థాయి గ్రేడ్ వస్తుందో లేదో అన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
25 జూలై 2008 నుంచి 24 జూలై 2011 వరకు వి.గోపాల్‌రెడ్డి, 25 జూలై 2011 నుంచి 24 ఏప్రిల్ 2012 వరకు కట్టా నర్సింహారెడ్డి, 24 ఏప్రిల్ 2012 నుం చి 25 జూలై 2016 వరకు జీ భాగ్యనారాయణ, 25 జూలై 2016 నుంచి 24 జూలై 2019 వరకు బీ రాజారత్నం, 25 జూలై 2019 నుంచి 21 మే 2021 వరకు రాహు ల్ బొజ్జా, 22 మే 2021 నుంచి 21 మే 2024 వరకు లక్ష్మీకాంత్ రాథోడ్ పీయూ వీసీలుగా కొనసాగారు. ప్రస్తుతం అహ్మద్ నదీం ఇన్చార్జి వీసీగా కొనసాగుతున్నారు.