మాగనూరు అక్టోబర్ 09 : ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో రైతుకు తీరని నష్టం వాటిల్లింది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వడ్వాట్ గ్రామానికి చెందిన రైతు బుక్క చిన్న అంజప్ప తన పొలంలో పండించిన పత్తి పంటను కూలీల సహాయంతో ఏరించి పొలం గట్టుపై కుప్పగా ఉంచాడు. అయితే రాత్రి సుమారు 8 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పత్తి కుప్పకు నిప్పు పెట్టినట్లు బాధిత రైతు తెలిపాడు.
ఈ ఘటనలో దాదాపు 15 క్వింటాళ్ల పత్తి కాలిపోయి బూడిదైనట్లు పేర్కొన్నాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంట నష్టపోయిన తనను ఆదుకునేందుకు సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టడంతో పాటు బాధిత రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.