నాగర్‌కర్నూల్, మార్చి 21(నమస్తే తెలంగాణ): ఖాకీ డ్రస్సు వేసుకోవడమంటే కొందరికి మహాక్రేజ్. పోలీసు కావాలని కొందరు చిన్నప్పటి నుంచి కలలు కంటుంటారు. అలాంటి కలలు త్వరలో సాకారం కానున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఇందులో భాగంగా పోలీసు ఉద్యోగాలు కూడా భర్తీ కానున్నాయి. దీంతో ఈ ఉద్యోగాలను సాధించేందుకు యువత సన్నద్ధమవుతున్నది. పోలీసు కొలువులంటే సమాజంలో ప్రత్యేక గౌరవం ఉన్నది. ఈ కారణంగా యువత పోలీసు కొలువులకు ఇప్పటి నుంచే సన్నద్ధం కానున్నారు. మిగతా పోస్టులతో పోల్చితే పోలీసు ఉద్యోగాల్లో శారీరక దారుఢ్యానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. దీనివల్ల యువకులు ముందస్తుగా సన్నద్ధమవుతున్నారు. కాగా పోలీసు ఉద్యోగాలకు శిక్షణ పొందేందుకు యువత హైదరాబాద్‌లాంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. అయితే పోలీసు శాఖ సొంతంగా ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా దాదాపుగా వచ్చే నెల మొదటి వారం నుంచి జిల్లా కేంద్రాల్లో పోలీసు ఉద్యోగార్థులకు శిక్షణ ఇవ్వనున్నది.
ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు శారీరక దారుఢ్యాన్ని పెంచడం, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రోలాంటి ఆటల్లో తర్ఫీదు ఇవ్వనున్నది. ఈ శిక్షణలను ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. స్వయంగా పోలీసు శాఖనే ఈ శిక్షణలు ఇచ్చేందుకు ముందుకురావడంతో యువత సంతోషం వ్యక్తం చేస్తున్నది. మండల కేంద్రాల్లోని పోలీసు స్టేషన్లలో యువత తమ అర్హతలతో కూడిన వివరాలతో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ దరఖాస్తు ఆధారంగా జిల్లా కేంద్రంలో ఈనెల చివరి వారంలో ముందుగా ఫిజికల్ టెస్టులతో రాత పరీక్షలకు అనుమతిస్తారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన దాదాపు 300మందికి ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తారు. మధ్యాహ్నం పోలీసు శాఖ ద్వారానే భోజన వసతి ఏర్పాటు చేయనున్నారు. నివాసం మాత్రం అభ్యర్థులే చూసుకోవాల్సి ఉంటుంది.
పోలీసు శాఖలో సుశిక్షితులైన అధికారులే ఉండనుండటంతో ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే యువతకు సానుకూలాంశం. ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్సైల్లాంటి పోలీసు అధికారులు ప్రతిరోజూ శిక్షణకు వచ్చి పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు, దేహదారుఢ్యం పెంచుకోవడం, ఆటల పోటీల్లో ప్రతిభ కనబర్చేందుకు అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారు. దీనివల్ల పోలీసు కొలువులకు పోటీపడే అభ్యర్థులు మంచి శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. మొత్తం మీద పోలీసు కొలువులకు పోటీ పడే పేద, నిరుద్యోగ, గ్రామీణ యువతకు ఇది చక్కటి అవకాశంగా నిలవనున్నది.
స్టేషన్లలో దరఖాస్తులు
ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. దీనికోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో దాదాపుగా 200నుంచి 300మందిని దేహదారుఢ్యం, రాత పరీక్షల ద్వారా శిక్షణ కోసం ఎంపిక చేస్తాం. జిల్లా కేంద్రంలోనే శిక్షణ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం అందిస్తాం. మండలాల్లోని పోలీసు స్టేషన్లలో శిక్షణ కోసం అర్హులైన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగాలు సాధించేలా మంచి శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటాం.
– మనోహర్, ఎస్పీ, నాగర్‌కర్నూల్