మహబూబ్నగర్టౌన్, మే 11 : ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన పరీక్షకు 11,284 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 10,664 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ ఇంటర్లో 8,818మంది, ఒకేషనల్లో 1,846మంది పరీక్షకు హాజరు కాగా, 620మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, మూడు సిట్టింగ్ స్క్యాడ్, రెండు ప్లయింగ్ స్క్యాడ్ బృందాలతోపాటు 32మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 32మంది డిపార్ట్మెంట్ అధికారులు పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పకడ్బందీగా నిర్వహించాలి
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరుశాతాన్ని తెలుసుకోవడంతోపాటు వసతులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని డీఐఈవో వెంకటేశ్వర్లుకు సూచించారు. కార్యక్రమంలో బాలుర కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి తదితరులు పాల్గొన్నారు.