మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మే 11: పోలీసులపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకొనేందుకు నిరంతరం కృషి చేయాలని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. పోలీసు జిల్లా కార్యాలయంలో బుధవారం శాంతిభద్రతలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. వేసవి సెలవులు, శుభకార్యాల సందడి దృష్ట్యా దొంగతనాలు, నేరాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కేంద్రంతోపాటు జాతీయరహదారి, గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు నిఘా బృందాలతో నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని తెలిపారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అవకాశం ఉన్న అనుమానిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లతో డబ్బులు పోగొట్టుకున్న బాధితులు వెంటనే 1930 నెంబర్‌కు ఫిర్యాదు చేసే విషయంపై ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలని తెలిపారు.
అలాగే ఆన్లైన్లో లభించే అప్పులతో కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలనాన్నారు. ముఖ్యంగా యువత మొబైల్ గేమ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో ఏర్పా టు చేసిన పోలీసు బందోబస్తును సమర్థవంతంగా నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. ఇందుకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పోలీస్స్టేషన్ల వారీగా నేరపరిశోధన తీరును తెలుసుకున్నారు. సమావేశంలో ఏఎస్పీ రాములు, డీఎస్పీలు వెంకటరమణారెడ్డి, శ్రీనివాసులు, లక్ష్మణ్, సాయిమనోహర్, మధు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు తదితరులు ఉన్నారు.