జడ్చర్లటౌన్, మే 24 : జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను అమ్మితే సీడ్ డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని డీఏవో వెంకటేశ్ హెచ్చరించారు. శనివారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్చర్ల సీఐ కమలాకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. జడ్చర్ల మండలం ఈర్లపల్లితండాల్లో నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉన్నట్లు సమాచారం మేరకు శనివారం పోలీస్, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టామన్నారు. తనిఖీల్లో భాగంగా ఈర్లపల్లితండాలో మేఘావత్ చంద్య అనే రైతు ఇంట్లో 35 కిలోలు , అతని కుమారుడు మేఘావత్ రవి ఇంట్లో 15 కిలోలు నకిలీ పత్తి విత్తనాలను లభ్యమైనట్లు తెలిపారు.
పట్టుబడిన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను జడ్చర్ల పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు 16 టాస్క్‌ఫోర్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నామన్నారు. ఒక్కో టీంలో సీఐ, ఎస్సై, వ్యవసాయాధికారులు ఉన్నట్లు తెలిపారు. వారంరోజులపాటు టాస్క్‌ఫోర్స్ టీమ్స్ ఎక్కడిక్కడ తనిఖీలను మమ్మురం చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 329 సీడ్ డీలర్లు ఉన్నారని, ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయించినట్లు నిర్ధారణ అయితే వారి ట్రేడ్ లైసెన్సులను రద్దు చేస్తామన్నారు.
అంతకు ముందు జడ్చర్ల సీఐ కమలాకర్ మాట్లాడుతూ నిందితులు చంద్య, రవిలను అదుపులోకి తీసుకొని విచారించగా జడ్చర్లకు చెందిన కృపాకర్‌రెడ్డి అనే వ్యక్తి నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేసినట్లు వెల్లడైందని చెప్పారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. కార్యక్రమంలో జడ్చర్ల ఎస్సై జయప్రసాద్, ఏడీఏ కృష్ణకిశోర్, ఏవోలు గోపినాథ్, సిద్దార్థ పాల్గొన్నారు.