అమరచింత, ఏప్రిల్ 24 : వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని కురువా వీధిలో నివాసముంటున్న వంశి, గాయత్రి దంపతుల కూతురు ఆర్థిక అనే 18 నెలల పసిపాప గురువారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలేజీలో ఒక మహిళ తన పాపకు మజా బాటిల్ లో ఏదో ఇవ్వడం వల్లే తాగి మృతి చెందిందని తల్లి గాయత్రి ఆరోపిస్తున్నది. సమాచారం అందుకున్న అమరచింత పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఈ సందర్భంగా పాప తల్లి గాయత్రి పోలీసులతో మాట్లాడుతూ సాకలి నరసింహ భార్య పద్మమ్మ తన బిడ్డకు మజా బాటిల్ ఇవ్వడంతో దాన్ని తాగిందని, బాటిల్లో ఉన్న మజా చుక్కలు పక్కనే ఉన్నతన కొడుకు కాలిపై పడడంతో బొబ్బర్లు వచ్చాయని, వెంటనే అప్రమత్తమై పాపను ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఆలోపే పాప మృతిచెందగా 100 నెంబర్కు డయాల్ చేశానని ఆమె తెలిపారు.
దీనిపై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని కంటతడి పెడుతూ పలువురిని వేడుకుంటుంది. ఇదిలా ఉండగా కాలుపై మాజా పడ్డ బాబుకు బొబ్బర్లు రావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచనల మేరకు జిల్లా ఆస్పత్రికి తరలించారు.