నవాబ్‌పేట, జూన్ 30 : మండలంలోని యన్మన్గండ్ల ఎస్సీ బాలుర వసతి గృ హం విద్యార్థులు భయం గుప్పిట్లో కాలం వెళ్లతీస్తున్నారు. హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని..పై కప్పు పెచ్చులు కూలి పడుతుండడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని విద్యార్థులు బిక్కుబిక్కు మంటూ రాత్రిళ్లు గడుపుతున్నారు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న శిథిలమై పోయిన భవనం వైపు అధికారులు, ప్ర జాప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.. ఇందుకు సంబంధించిన వివరాలోకి వెళ్తే.. నవాబ్‌పేట మండలంలోని యన్మన్గండ్లలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఇక్కడి చుట్టుపక్కల గ్రామాల విద్యార్థుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని 1985లో నాటి విద్యాశాఖ మంత్రి ఇంద్రారెడ్డి ప్రారంభించారు. కాగా భవనం నిర్మించి 40 ఏండ్లు గడిచిపోవడంతో భవనం పూర్తిగా శిథిలావస్థకు చే కున్నది. గత కొంత కాలం నుంచి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నా.. ఏదో కంటి తుడుపు చర్యలు చేపట్టారే తప్పా శాశ్వతంగా పరిష్కారం చూపలేకపోయారు. హాస్టల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఏడాది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తుంటారు.
ఈ ఏడాది కూడా 120 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నారు. కాగా భవనంలో మొత్తం 15 గదులకు గానూ 7 గదులు పూర్తిగా శిథిలమై పోయాయి. ఇటీవల కురిసిన వర్షానికి పైకప్పు పెచ్చులు సగభాగం కూలి కింద పడిపోయింది. విద్యార్థులు ఎవరూ లేని సమయంలో కూలిపోయింది. కాబట్టి పెద్ద ప్రమాదం నుంచి విద్యార్థులు బయటపడ్డారు. శిథిలమైన రూముల్లో నుంచి హాస్టల్ వార్డెన్, వర్కర్లు, విద్యార్థులను ఖాళీ చేయించి ఇతర గదుల్లోకి మార్చారు. మిగతా రూముల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. సోమవారం ‘నమస్తే తెలంగాణ’ హాస్టల్‌కు వెళ్లి..విద్యార్థులను పలకరించగా.. వారిలోని భయాన్ని, బాధను వెళ్లగక్కారు. గత రెండు, మూడేండ్ల నుంచి బిల్డింగ్ బాగలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మొన్ననే నాలుగైదు రూముల్లో పైకప్పు కూలిపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని వారు వాపోయారు. కాగా కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడగా భవనం పరిస్థితి దారుణంగా ఉంది. ఏమైనా ప్రమాదం జరిగితే గానీ స్పందించరా అంటూ వాపోయారు. ఈ విషయమై వార్డెన్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా హాస్టల్ అధ్వానంగా ఉందనే విషయాన్ని ఇటీవలే జిల్లా ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఇక్కడి సమస్యను అర్థం చేసుకొని నూతన భవనాన్ని నిర్మిస్తే..బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.