కొల్లాపూర్ : తెలంగాణలో హెలీ టూరిజాన్ని ( Heli tourism ) అభివృద్ధి త్వరలోనే ప్రారంభించనున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) అన్నారు. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విధంగా హెలీ టూరిజం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
రూ. 68.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సోమశిల వెల్నెస్ ( Somaseela Wellness ) , స్పిరిచ్యువల్ రిట్రీట్, నల్లమల ప్రాజెక్టు అభివృద్ధి పనులకు మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అమరగిరిలో
రూ. 45.84 కోట్ల వ్యయంతో అమరగిరి ఐలాండ్ వెల్నెస్ రిట్రీట్ నిర్మాణ పనులు, రూ. 1.60 కోట్లతో సోమశిల వీఐపీ ఘాట్-బోటింగ్ పాయింట్ కోసం ట్రెంచింగ్ పనులకు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గగనతలంలో కొద్దిసేపు విహరింపజేసి పర్యాటకులకు అహ్లాదాన్ని, అనుభూతిని కల్పించేందుకు హెలీ టూరిజం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈజ్ మై ట్రిప్ సంస్థ సహకారంతో హైదరాబాద్ నుంచి సోమశిల అక్కడి నుంచి శ్రీశైలం మీదుగా హైదరాబాద్కు హెలీ టూరిజం నిర్వహణకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. దీని వల్ల పర్యాటక రంగం కొత్తమలుపు తిరుగుతుందని పేర్కొన్నారు.
పర్యాటక ఆతిథ్యానికి తెలంగాణ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు మౌలిక వసతుల కల్పనతో పాటు విస్తృత ప్రచారం నిర్వహిస్తామని మంత్రి వివరించారు. టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధి వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సోమశిల- సిద్దేశ్వరం ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తైతే దూరాభారం తగ్గడంతో పాటు పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యాటక అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.