గద్వాల, ఆగస్టు 4 : జూరాల ప్రాజెక్టుకు మంగళ వారం వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండడంతో జూరాల ప్రాజె క్టులోకి వరద నిరంతరాయంగా వచ్చి చేరుతున్నది. ఎగువన ఉన్న అల్మట్టి నుంచి 1,50,000 క్యూసె క్కుల వరద నీరు నారాయణపూర్ డ్యాం వచ్చి చేరుతుండడంతో నారాయణపూర్ డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టుకు 1,45,376 వరద నీటిని విడుదల చేస్తున్న క్రమంలో జూరాల ప్రాజెక్టు వైపు కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో జూరాల కృష్ణ మ్మ నీటితో నిండుకుండలా మారింది.
సాయంత్రం వరకు జూరాలకు 2,41,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.53 మీటర్ల నీటి నిల్వ ఉన్నది. జూరాల ప్రాజెకు ్ట పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.701 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉన్నది. విద్యుత్ ఉత్పత్తికి 26,817 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తు న్నారు.
జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,41, 000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 33 గేట్లు తెరిచి దిగువకు 2,53,102 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఇన్‌ఫ్లో 2,41,000 కాగా మొత్తం అవుట్ ఫ్లో 2,53,102 క్యూ సెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు గేట్ల ద్వారా దిగువ కు 2,21331 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అల్మట్టి, నారాయణపూర్, భీమా నదికి వరద వస్తుండడంతో జూరాలకు మరింత పెరిగే అవకాశం ఉంది. రాత్రికి మరిన్ని గేట్లు ఎత్తి దిగువ కు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
అయిజ, ఆగస్టు 4 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర ప్రాజెక్టు వరద లక్ష క్యూసెక్కులకు పైగా చేరుతోంది. మంగళవారం టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 1,02,698 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,556 క్యూసెక్కులు నమోదైంది. కర్ణాటక, ఏపీ రాష్ర్టాల తాగునీటి అవసరాల కోసం నీటిని కాల్వలకు విడుదల చేస్తున్నారు. టీబీ డ్యాం గరిష్ఠస్థాయి నీటి మట్టం1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1617.43 అడుగుల నీటి మట్టం ఉన్నది. అలాగే 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 54.420 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఎగువ ప్రాంతంలో వరుణుడు దంచి కొడుతుండటంతో తుంగ ప్రాజెక్టుతోపాటు పరివాహక ప్రాంతాల నుంచి వరద పరవళ్లు తుంగభద్ర డ్యాంలోకి చేరుతుందని డ్యాం సెక్షన్ అధికారి కిరణ్ తెలిపారు. బుధవారం డ్యాంలోకి మరింత చేరే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి గత రెండు రోజులుగా తుంగభద్ర డ్యాంలోకి వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతుండడంతో తుంగభద్ర పరీవాహక రాష్ర్టాల రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మూడు రాష్ర్టాలకు వరదాయినిగా నిలుస్తున్న తుంగభద్రకు ఈ ఏడాది వరద భారీగా చేరడం ఇదే మొదటిసారి కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డ్యాంలో నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. ఇదేస్థాయిలో వరద కొనసాగితే ఆగస్టు 15 నాటికి తుంగభద్ర ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు తాగు, సాగునీటికి కష్టాలు పడాల్సి వస్తుందని ఆందోళనలో ఉన్న నదీతీర ప్రాంతాల రైతులు, ప్రజలకు తుంగభద్రకు వరద పోటెత్తుతుండడంతో ప్రజలకు ఊరట కలిగించే అంశమని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు.
ఊట్కూర్, ఆగస్టు 4 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భీమా నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఈనేపథ్యంలో కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా భీమా నదిపై ఉన్న గూగుల్ (గుగ్గల్) బ్యారేజ్ వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని మంగళవారం బ్యారేజ్‌కు సంబందించిన 35 గేట్లను ఎత్తి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో భీమా నది పరవళ్లు తొ క్కుతూ కృష్ణానది వైపు దూసుకెళ్తోంది. ఒకవైపు ఉ ధృతంగా ఉరకలేస్తూ వస్తున్న భీమా.. మరో వైపు పరవళ్లు తొక్కుతూ పరుగులు పెడుతున్న కృష్ణమ్మ.. ఈ రెండు మహానదులు కృష్ణ మండలం తంగడి సంగమ క్షేత్రంలో ఒకటై జలవైభవాన్ని ఆవిష్కరిస్తున్నాయి. రెండు నదుల వరద జలాలు సంగమించిన అనంతరం మరింత ఉధృతంగా కృష్ణా నదిలో కలవడంతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు చేరే ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నదీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు తెలంగాణ, అటు కర్ణాటక అధికారు లు సూచిస్తున్నారు. తక్కువ ఎత్తులో ఉన్న వంతెనలు, కాజ్‌వేలపై నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో అనవసర ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే రానున్న 24 గంటల్లో మరింత అధికమయ్యే అవకాశం ఉందని జలవనరుల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
శ్రీశైలం, ఆగస్టు 4 : శ్రీశైలం జలాశయానికి క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతూ ఉన్నది. వారం రోజుల నుంచి మొదలైన కృష్ణమ్మ రాకతో జలాశ యం జలకళను సంతరించుకుంటుంది. మంగళవారం జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల ద్వారా 2,21,331 క్యూసెక్కుల నీరు విడుదల కాగా, విద్యుదుత్పత్తి ద్వారా 26,817 క్యూసెక్కుల వరద నీరు విడుదలైంది. మొత్తం 2,48,148 క్యూసెక్కుల నీరు విడుదలకాగా మంగళవారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్‌కు 1,91,076 క్యూసెక్కుల నీరు వచ్చి చేరినట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. జలాశ యం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులకు గా నూ ప్రస్తుతం 860.80 అడుగులు, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలుకాగా ప్రస్తుతం 108.48 టీఎంసీల నీరు ఉన్నట్లు నమోదైంది. అదేవిధంగా కుడి ఎడమ గట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఎటువంటి విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు.