వనపర్తి, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. 14 మండలాల వారీగా వరి కోతలు జోరందుకున్నా.. ధాన్యం కొనుగోళ్ల పనులు వేగం పుంజుకోవడం లేదు. ముందు నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి ధాన్యం కొనుగోళ్లపై పకడ్బందీగా సమీక్షలు నిర్వహించి సమాయత్తం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పని వేగవంతం కావడం లేదన్న విమర్శలు ఉ న్నాయి. జిల్లాలో 377 సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయినా ఇంకా అనేక సెంటర్లు తెరుచుకోలేదు. తెరుచుకున్న సెంటర్లకు సామగ్రి పంపిణీ కాలేదు. జిల్లాలో 1.87 లక్షల ఎకరాల్లో వరి శిస్తులున్నాయి. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందన్న భారీ లక్ష్యం ఉన్నది. ఈ మేర కు అనుకున్న స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ జరగడం లేదు.
ధాన్యం విక్రయాల కోసం వచ్చిన రైతులు పడిగాపులు కాయాల్సి వస్తుంది. దొడ్డు రకాలను ఎలాగో అమ్ముకుంటున్న రైతులు, సన్నరకాలను అమ్ముకోవాలంటే తలపా నం తోకకు వస్తుందని అంటున్నారు. పది, ఇరవైరోజుల త రబడి మార్కెట్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు రా వడంతో గందరగోళానికి గురవుతున్నారు. చాలా మంది మార్కెట్లో ఈ అవస్థలు చూసి ప్రైవేట్ వ్యాపారులకు కట్టబెడుతున్నారు. సర్కారు కొనుగోళ్ల కన్నా ప్రైవేట్గానే పని సులభమవుతుందన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. పేరుకు రూ.500 బోనస్ అన్నారు.. కానీ, కొత్త ని బంధనలు పెట్టి రైతులను నిట్టనిలవునా ముంచుతున్నారన్న విమర్శలు వెలువడుతున్నాయి. రోజుల తరబడి కొనుగోళ్లు చేయక పెండింగ్లో పెడితే రైతులు మార్కెట్కు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు.
వనపర్తి మార్కెట్ యార్డులో మెప్మా, ఐకేపీ ఆధ్వర్యంలో రెండు సెంటర్లు పని చేస్తున్నాయి. అయితే, ఇక్కడికి భారీగానే ధాన్యం వస్తున్నది. ప్రైవేట్ వ్యాపారులే ఈ సెంటర్ల కంటే అధిక ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. వరికి తోడుగా వేరుశనగ కూడా వస్తున్నది. ఇలా ప్రైవేట్ వ్యాపారులు కొ నుగోలు చేసిన సరుకుల తూకాల పనులు పూర్తయ్యాకే.. మెప్మా, ఐకేపీ సెంటర్ల పరిధిలో ధాన్యం తూకాలకు చాట కూలీలు, హమాలీలు వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో చివరి సమయంలో ఒక గంట మాత్రమే త మ సెంటర్లకు తూకాలు చేయడం కోసం రావడంతో పని వేగవంతం కావడం లేదని చెబుతున్నారు. సాయంత్రమై తే పని ముగించే వెళ్లిపోతున్నారని, ఇలా చేయడంతో తూ కాలు పెండింగ్ పడి ఎక్కువ రోజులు రైతులు మార్కెట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నట్లు చెబుతున్నారు.
వెంటాడుతున్న గన్నీ బ్యాగుల కొరత
ఆయా సెంటర్ల వారీగా గన్నీ బ్యాగుల కొరత కూడా ఉత్పన్నమవుతున్నది. జిల్లా మొత్తంగా కోటి గన్నీ బ్యాగులు అవసరమైతే, కేవలం 20 లక్షల గన్నీ బ్యాగులతోనే పనులను ప్రారంభించారు. మిగిలిన బస్తాలు క్రమంగా వస్తాయని పౌరసరపరాల శాఖ అధికారులు చెబుతున్నా.. ఇప్పటికే పలు సెంటర్లలో గన్నీ బ్యాగులు లేవని చెబుతున్నారు. కేవలం 5వేల బస్తాలు మాత్రమే ఒక్కో సెంటర్కు పంపిస్తున్నారు. ఇవి సక్రమంగా తూకాలు జరిగితే ఒకేరోజు పూర్తి అవుతాయని సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. వనపర్తి మార్కెట్లోని ఐకేపీ సెంటర్లో గురువారం బస్తాలు అందుబాటులో లేవు. సాయంత్రం వరకు వస్తాయని అధికారులు చెప్పినట్లు అక్కడి వీవోఏ హేమలత చెప్పారు. అలాగే అమరచింత మండలం ఈర్లదిన్నె, పామిరెడ్డిపల్లి సెంటర్లకు కేటాయించిన 5 వేల బస్తాలు అయిపోగా, ఇతర సెంటర్లమీద ఆధారపడాల్సి వచ్చింది. ఇలా ఏ సెంటర్లో చూసినా.. ఏదో ఒక సమస్య వెంటాడుతున్నది.
వనపర్తి మండలం అప్పాయిపల్లి పరిధిలోని కీర్యాతండాకు చెందిన బుడ్డమ్మ దీపావళి పండుగ ముందురోజు జిల్లా కేంద్రంలోని మార్కెట్కు 60 బస్తాల సన్న వడ్లు తెచ్చింది. ఇక్కడ రెండు సెంటర్లున్నా.. ఏ సెంటర్లోనూ సక్రమంగా కొనుగోలు జరగడం లేదు. ఒకటి వనపర్తికి చెందిన మెప్మా సెంటరైతే, మరోటి చిట్యాలకు చెందిన ఐకేపీ సెంటర్. వీటిలో ముందుగా రెండు సెంటర్లలో దొడ్డు, సన్నవడ్లు కొంటారని చెప్పి మళ్లీ ఐకేపీ సెంటర్లోనే సన్నాలు కొంటామని చెబుతున్నారు. ఇద్దరి మధ్య బుడ్డమ్మ పది రోజుల నుంచి మార్కెట్లోనే మకాం పెట్టక తప్పలేదు.