మక్తల్ : కాలుష్యాన్ని విడుదల చేసే ఇథనాల్ ఫ్యాక్టరీలను (Ethanol factories) వెంటనే మూసివేసి రైతులకు న్యాయం చేయాలని పుడమి ఫౌండేషన్ ( Pudami Foundation ) అధ్యక్షులు జయ వెంకటపతి రాజు, ఉపాధ్యక్షులు రవికుమార్, ఎగ్జిక్యూటివ్ నెంబర్ పవన్, గుడిసె రాజేష్ శనివారం డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజాపోరాటం చేస్తున్న తరుణంలో, రైతులను ప్రభుత్వం నిర్బంధించి జైల్లో పెట్టడం దారుణమని అన్నారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల వచ్చే రసాయనాలు చెరువులు, కుంటాలు, నదిలో వదిలేయడం వల్ల ఆ రసాయన నీళ్లు తాగి జీవరాశులు, మనుషులు అనారోగ్యాల బారిన పడి చనిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల బాగు గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం యజమానులకు వత్తాసు పలుకుతూ, రైతులను జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు.
రైతుల పక్షాన ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టరాదని వార్త కథనాలు రాసిన జర్నలిస్టుల పై ప్రభుత్వం కేసులు పెట్టడం న్యాయం కాదని అన్నారు. రైతులు, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.