మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 24 : దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఫిజియోథెరపీ కళాశాల నిర్మాణానికిగానూ ప్రతిపాదిత స్థలంలో లేఅవుట్, అంచనాలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ జి.రవినాయక్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన పక్కన ఫిజియోథెరపీ కళాశాల నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని శుక్రవారం కళాశాల చైర్మన్, మాజీ చీఫ్ సెకట్రరీ ఐవైఆర్ కృష్ణారావుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ఎంఐడీసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్లాన్ తయారుచేసి అంచనాలు సమర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఫిజియోథెరపీ కళాశాల సెక్రటరీ లక్ష్మీసుందరి, డైరెక్టర్ వైఎస్ఎన్ మూర్తి, ప్రిన్సిపాల్ కార్తీక్, టీఎస్ఎంఐడీసీ డీఈ వేణుగోపాల్, ప్రభుత్వ జనరల్ దవాఖాన డిప్యూటీ సూపరింటెండెంట్ డా.జీవన్, ఆర్ఎంవో సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.