 
                                                            వైద్య రంగంలో నవశకం ప్రారంభమైంది. మారుమూల ప్రాంతాల్లో సైతం మెడికల్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత నూతన జిల్లా ఏర్పాటుతో పాటు ఒక్కో జిల్లాలో వైద్య కాలేజీలను ప్రారంభించి సరికొత్త చరిత్రకు నాంది పలికారు. దీంతో రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పేద విద్యార్థులు ఉచితంగా వైద్య విద్యను పొందుతూ డాక్టర వ్వాలనే కోరికను తీర్చుకొంటున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో గతేడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ప్రారంభమైంది. ఓవైపు రెండో విడుత ఫస్టియర్‌కు అడ్మిషన్లు పొందుతూ విద్యార్థులు సందడి చేస్తుండగా.. తమ పిల్లలు డాక్టర్లవు తుండడంతో సంతోషంతో స్వయంగా దగ్గరుండి కళాశాలలో చేరుస్తూ తల్లిదండ్రులు మరోవైపు ఆనందాన్ని పొందు తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కాగా పట్టణంలో రూ.166 కోట్లతో నూతన కళాశాల భవన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి.
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో నాగర్కర్నూల్లాంటి మారుమూల ప్రాంతంలో వైద్యం పేదలకు అందని ద్రాక్షగా ఉండేది. నల్లమలలోని అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాల్లోని ప్రజలు మలేరియా, డెంగీ, డయేరియాలాంటి వ్యాధులు, పాముకాట్లు వేసినా ప్రాణాలపై ఆశలు వదులుకొనే పరిస్థితులు సర్వసాధారణంగా ఉండేవి. స్థానిక పీహెచ్సీ, సివిల్, ఏరియా దవాఖానల్లో డాక్టర్లు, మందులు, వైద్యపరికరాలు లేక మహబూబ్‌నగర్, హైదరాబాద్ వెళ్లాల్సిన దుస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితులు గత చరిత్ర. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సాధించుకున్న తెలంగాణలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో ఏకంగా మెడికల్ కళాశాలలు మంజూరు కావడం సరికొత్త మార్పునకు శ్రీకారం.
తెలంగాణ రాకముందు కేవలం ఐదు మెడికల్ కళాశాలలుండగా అందులో 850సీట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 29మెడికల్ కళాశాలలు ఏర్పాటుకాగా 3,790సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది నాగర్‌కర్నూల్ జిల్లాలో 150సీట్లతో మెడికల్ కళాశాల ప్రారంభమైంది. ప్రస్తుతం రెండో బ్యాచ్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. దీంతో ఉమ్మడి పాలమూరుతో పాటుగా ఇతర రాష్ర్టాల విద్యార్థులకూ ఉచితంగా ఉన్నతమైన వైద్య విద్య అందుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో సాగు,తాగునీటికీ ఇబ్బంది పడిన పరిస్థితులుండగా కనీసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయేలేని పరిస్థితులు ఉండేవి. ఇక నాగర్‌కర్నూల్‌కు గతంలో మంజూరైన ఇంజినీరింగ్ కళాశాలను, ప్రైవేట్ మెడికల్ కళాశాలను ఇతర ప్రాంతాలకు తరలిపోయేలా స్థానిక నేతలు చేయడం జరిగింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏకంగా మెడికల్ కళాశాలనే మంజూరు చేయడం గమనార్హం. గతేడాది 150సీట్లతో మెడికల్ కళాశాల ప్రారంభం కాగా అప్పటి విద్యార్థులు రెండో సంవత్సరం చదువుతున్నారు.
ఈ సంవత్సరం ఫస్టియర్‌లో విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు పెరగడంతో విద్యార్థులకు గతంలో కంటే తక్కువ ర్యాంకు వచ్చినా ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు దొరుకుతున్నాయి. దీనివల్ల ఎంబీబీఎస్ చేసేందుకు ఇంతకు ముందు ఉక్రెయిన్, రష్యాలాంటి దేశాలకు వెళ్లే విద్యార్థులు సొంత రాష్ట్రంలోనే సీట్లు పొందుతూ డాక్టర్ కావాలనే ఆకాంక్షను సాధించేలా ముందుకు సాగుతున్నారు. ఫలితంగా రూ.లక్షల నుంచి రూ.కోటి వరకు వైద్యవిద్యకు ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. దీంతో పేద విద్యార్థులు ప్రతిభ ఉన్నా వైద్య విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఉండగా ఇప్పుడు ఉచితంగా ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన ఎంబీబీఎస్ చదువును కొనసాగిస్తుండటం గమనార్హం. జోనల్ సిస్టం ఏర్పాటుతో తెలంగాణ విద్యార్థులకే అధికంగా మెడిసిన్ సీట్లు వస్తుండటంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు సైతం రాబోయే ఐదేళ్లలో పెద్ద సంఖ్యలో డాక్టర్లుగా అవతరించి సమాజానికి సేవ చేయబోతున్నారు.
నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీతో పాటుగా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దేశంలో 171 కాలేజీలను మంజూరు చేసినా తెలంగాణకు ఒక్క మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తోంది. కాగా మెడికల్ కళాశాలకు అనుబంధంగా 100పడకలతో ఉన్న జిల్లా ఆస్పత్రి ప్రస్తుతం 330పడకలకు చేరుకొంది. దీనివల్ల నల్లమలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల పేదలకూ వైద్య సేవలు మరింత మెరుగయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్ద పీట వేసింది. ఫలితంగా స్థానిక ఆస్పత్రిలో ఐసీయూ, డయాలసిస్లాంటి సేవలూ అందుబాటులోకి వచ్చాయి. అలాగే కేసీఆర్ కిట్, న్యూట్రీషియన్ కిట్, పల్లె,బస్తీ దవఖానాలు, ఆరోగ్య మహిళా కేంద్రాలు, కంటి వెలుగు, ఆరోగ్య లక్ష్మిలాంటి పలు పథకాలను అమలు చే సింది. దీనివల్ల ఓవైపు పేద విద్యార్థులు డా క్టర్లుగా మారుతుంటే మరోవైపు పేదలకు ఉన్నత వైద్యం స్థానికంగానే అందుతోండటం విశేషం. ఇక నాగర్‌కర్నూల్ జి ల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.166కోట్లను మం జూరు చేయగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ నూతన భవనానికి ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సొంతూరిలో ఉన్నట్లే ఉంది
మాది హైదరాబాద్. నాకు తొలి విడుతలో ప్రైవేట్ కాలేజీలో సీటు వచ్చింది. కానీ ప్రభుత్వ కాలేజీలోనే చదవాలనుకొని రెండో విడుత కౌన్సెలింగ్ పెట్టుకొంటే నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ప్రభుత్వ కళాశాలకు అనుబంధంగా దవాఖాన ఉండడంతో ప్రాక్టికల్స్ మంచిగా నేర్చుకొనే అవకాశం ఉంది. రూరల్ ఏరియాలో ఎలా ఉంటుందో అనుకున్నా.. కానీ ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. కాలేజీ బిల్డింగ్, క్లాస్ రూంలు చాలా బాగున్నాయి. మా బంధువులైన అన్నా, వదినను చూసి నేనూ డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. సీఎం కేసీఆర్ సార్ స్టేట్‌లో ఎక్కువ మెడికల్ కాలేజీలు పెట్టడంతో నాకు ఇక్కడ ఉచితంగా సీటు వచ్చింది. సొంతూరులో ఉన్నాననే ఫీలింగ్ ఉంది. డాక్టర్ కావాలనుకున్న నా కల తెలంగాణ ఏర్పాటుతో సాధ్యమైనట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే కాలేజీల సంఖ్య పెరగడంతో సొంత రాష్ట్రంలోనే, అది హైదరాబాద్‌కు దగ్గరగానే మెడిసిన్ చదువుతున్నా.
-ఉదితా శ్రీ (హైదరాబాద్) నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీ ఫస్టియర్ స్టూడెంట్
వ్యవసాయ కుటుంబం నుంచి మెడిసిన్ చదువుతాననుకోలేదు..
మా ఆర్థిక పరిస్థితులతో ప్రైవేట్‌లో మెడిసిన్ చదివే పరిస్థితులు లేవు. నాకూ ఈడబ్ల్యూఎస్ కోటాలో 13వేల ర్యాంకు వచ్చింది. ప్రభుత్వం మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడం వల్లే నాకు నాగర్‌కర్నూల్ కాలేజీలో ఫస్టియర్‌లో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. మాది వ్యవసాయ కుటుంబం. నాకు డాక్టర్ కావాలని కోరిక. కానీ చదివించేంత డబ్బులు మా వద్ద లేవు. సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడం వల్ల నాకు సీటు వచ్చింది. నేను కష్టపడి చదివి డాక్టర్‌ను అవుతా.
– హరిణి, విద్యార్థిని
సీఎం కేసీఆర్ వల్లే పేదలకు డాక్టర్ సీట్లు..
మాది సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కొండాయగూడెం గ్రామం. వ్యవసాయం చేసుకొని కూతురిని చదివిస్తున్నా. మా కూతురు డాక్టర్ చదువాలని చిన్నప్పటి నుంచి లక్ష్యంగా పెట్టుకొన్నది. కానీ చదివించే ఆర్థిక స్థోమత లేదు. డబ్బులున్నోళ్ల పిల్లలే డాక్టర్ చదువులు చదువుతున్నారు. కానీ సీఎం కేసీఆర్ కొత్తగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వడంతో మేము మా కూతురిని డాక్టర్ చదివించగలుగుతున్నాం. మా కూతురు కన్న కలలను సీఎం కేసీఆర్ రూపంలో సాకారమవుతున్నాయి. డాక్టర్ చదువుకు లక్షలు, కోటి వరకు డబ్బులవుతాయని అంటున్నారు. మాలాంటి వాళ్లం కూడా పిల్లలను డాక్టర్ చదువులు చదివించగలుగుతున్నాం. నాగర్‌కర్నూల్ కళాశాలలో సీటు వచ్చింది. ఈరోజే ఫస్టియర్‌లో జాయిన్ చేయించాం.
– శ్రీనివాస్‌రెడ్డి (హరిణి తండ్రి), సూర్యాపేట
మెరుగైన విద్యాబోధన, స్థానికులకే సీట్లు 
సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుతో పాటుగా జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ మంజూరు చేయడం విశేషం. దీనివల్ల మెడిసిన్ సీట్ల సంఖ్య పెరిగింది. గతానికంటే తక్కువ ర్యాంకు వచ్చినా మెడికల్ సీట్లు లభిస్తున్నాయి. దీనివల్ల పేద విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుకోవడానికి అవకాశం దొరికింది. విదేశాలకు వెళ్లే, ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు తెలంగాణలోనే ప్రభుత్వ మెడిసిన్ సీట్లు లభిస్తున్నాయి. నాగర్‌కర్నూల్ కాలేజీలో గతేడాది 150సీట్లు ఉండగా 79మంది బాలికలు ఫస్టియర్ చదివారు. ప్రస్తుతం రెండో విడుత అడ్మిషన్లు పూర్తవుతున్నాయి. ఆధునిక భవనం, చక్కటి వాతావరణం, అనుభవం కల ప్రొఫెసర్లు, అనుబంధ దవాఖాన ఉండటం వల్ల విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిస్తున్నాం. రూ.166కోట్లతో నూతన భవన నిర్మాణం దాదాపుగా పూర్తి కావిస్తున్నది వైద్య విద్యకు సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యతకు కృతజ్ఙతలు.
– రమాదేవి, సూపరింటెండెంట్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, నాగర్‌కర్నూల్
మంచి సదుపాయాలున్నాయి..
మాది రాజస్థాన్ రాష్ట్రం. మా అమ్మనాన్నలు ప్రైవేట్ ఉద్యోగులు. ప్రైవేట్ కాలేజీలో చదివించలేని పరిస్థితులు మావి. నీట్ ర్యాంకు ప్రకారం నాగర్‌కర్నూల్ కాలేజీలో సీటు వచ్చింది. తెలంగాణలో కాలేజీలు ఎక్కువ, మంచి చదువు ఉంటుందని మా బంధువులు చెప్పారు. ఇప్పుడు ఫస్టియర్‌లో జాయిన్ అయ్యాను. ఈ కాలేజీ, వాతావరణం చాలా బాగుంది. మా ఆర్థిక పరిస్థితుల ప్రకారం నేను ప్రైవేట్‌గా మెడిసిన్ చదవలేను. ప్రొఫెసర్లు అర్థమయ్యేలా మంచిగా క్లాసెస్ చెబుతున్నారు. స్థానికంగా మాట్లాడటంలో భాషా సమస్య మాత్రమే ఉంది. మా అమ్మానాన్నలు నేను డాక్టర్ కావాలనే కలను తెలంగాణ రాష్ట్రంలో తీరుతుంది. సీఎం కేసీఆర్‌కి థ్యాంక్స్. – రాశి బదాయా, విద్యార్థిని, రాజస్థాన్
డాక్టర్ చదవాలన్న కల సాకారమైంది.. 
డాక్టర్ కావాలనుకున్న నా కల నాగర్‌కర్నూల్‌లో సాకారం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. పదో తరగతి నుంచి డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. 1,14,227 ర్యాంకు వచ్చింది. నాన్న ప్రైవేట్ ఉద్యోగి. అమ్మ టీచర్. ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ చదివించేంత పరిస్థితులు లేవు. సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం వల్ల నాకు ప్రభుత్వ కాలేజీలో ఉచిత సీటు వచ్చింది. నాగర్‌కర్నూల్, హైదరాబాద్‌కు చాలా దగ్గర. ఇక్కడ మంచి బిల్డింగ్తోపాటుగా అనుభవం గల ప్రొఫెసర్లు ఉన్నారు. మా అమ్మనాన్నలకు నేను డాక్టర్ చదువుతుంటే చాలా సంతోషంగా ఉంది. కష్టపడి చదివి మెడిసిన్ మంచి ర్యాంకులో పాసవుతా.
– శ్రీజ, హైదరాబాద్
 
                            