బాలానగర్, డిసెంబర్ 4 : రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో రాత్రి కనిష్ఠంగా నమోదవుతున్నాయి. అయితే, చలి నుంచి రక్షణ పొందేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎలాంటి పండ్లు తినాలి, ఏ సమయంలో ఏఏ ఆహారం తీసుకోవాలి అనే అంశాలను వివరిస్తున్నారు. అలాగే, చర్మరక్షణ కోసం సన్స్కిన్ లోషన్లతోపాటు ఇంట్లోనే పాటించగలిగే చిన్న చిన్న చిట్కాలను చెబుతున్నారు. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఎవరూ భయాందోళనకు గురికాకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలంటున్నారు.
రోజురోజుకూ చలి పెరుగుతోంది. చలితోపాటు వ్యాధులు సైతం విజృంభిస్తాయి. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాలకు ముప్పుతెస్తాయి. ఈ సీజన్లో ఎక్కువగా ఉబ్ససం, ఆయాసం, గుండె జబ్బులు ఇబ్బంది పెడతాయి. ఉదయం జాకింగ్, వాకింగ్‌కు వెళ్లాలంటే చర్మం పొడిబారి బిగుసుగా మారే అవకాశం ఉంటుంది. కాళ్ల మడిమలు, పెదాలు పగలడం వంటి సమస్యలొస్తాయి. ముఖ్యంగా పిల్లలపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వివిధ రుగ్మతలు ఉన్న వారు జాగ్రత్తలు పాటిస్తే చలికాలంలో వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో శరీరానికి మాయిశ్చరైజర్లు తప్పనిసరి. క్రీమ్ బెస్ట్ మాయిశ్చరైజర్లను ఉపయోగించడం మంచింది. ముఖం, చేతులు, కాళ్లకు రాసుకుంటే చర్మం మృదువుగా, కోమలంగా ఉంటుంది. చలికాలంలో వేధించే మరో సమస్య పెదాలు పగలడం. పెదాలు పగిలి రక్తం కారకుండా వ్యాజిలిన్, లిప్‌బామ్ రాసుకోవాలి.
చిన్నారులు జాగ్రత్త..
చలికాలంలో చిన్నారులకు జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలి నుంచి రక్షణ కోసం స్వెట్టర్లను తొడిగించాలి. వేడినీటితో స్నానం చేయించాలి. ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లలకు ఇచ్చే అహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
గుండెజబ్బులున్న వారు..
చలికాలంలో గుండె జబ్బులున్నవారు, గుండె ఆపరేషన్ చేయించుకున్న వారు వాకింగ్ చేయొద్దు. చలిలో ఎక్కువగా తిరిగితే రక్తనాళాలు సంకోచించి గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. బీపీ, షుగర్ ఉన్నవారు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచింది.
గ్లిజరిన్ సబ్బులు..
చలికాలంలో చర్మం తెల్లగా పొడిబారకుండా ఉండానికి గ్లిజరిన్ సబ్బులు వాడాలి. బాత్ సోప్ కూడా ఆయిల్ బెస్ట్‌తో ఉన్నవి వాడడం మంచిది. అప్పుడే చర్మం మృదువుగా ఉంటుంది. స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్, తలకు కొబ్బరినూనెతో మసాజ్ చేసుకొని వేడినీటితో స్నానం చేయాలి. ఎక్కువ సేపు స్నానం చేస్తే చర్మం లోపలి కణాలు దెబ్బతింటాయి.
ఆస్తమా ఉంటే…
చలికాలంలో ఆస్తమా ఉన్న వారు నిత్యం వాడే మందులను సిద్ధంగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి పనులకు దూరంగా ఉండాలి. చల్లటి గాలికి తిరుగొద్దు. శ్వాసనాళాలు, మూసుకుపోకుండా డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. ఇన్హేలర్, నెబ్యులైజర్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలి.
పాదాలు పగిలితే..
చలికాలంలో ఎక్కువగా పాదాలు పగులుతాయి. ఉప్పునీళ్లు కలిపిన గోరు వెచ్చని నీటిలో పాదాలను పది నిమిషాలపాటు ఉంచాలి. ఆ తర్వాత సబ్బుతో శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి. విటమిన్-ఈ క్రీమ్ రాస్తే మంచిది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సలహాలు పాటించాలి.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
జాగ్రత్తలు తీసుకోవాలి
చలికాలంలో ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్ని దుస్తులు ధరించాలి. బైక్‌పై వెళ్లే వారు మంకీ క్యాప్, కాళ్లకు షూ, చేతులకు గ్లౌజ్‌లు ధరించాలి. వాస్లేన్ తప్పనిసరిగా వాడుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలగవు.