Thummilla Lift | అయిజ, మే 12 : ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్వ వైభవం సంతరించు కోనున్నది. ఆనకట్టకు కేటాయించిన 15.9 టీఎంసీలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. చివరి ఆయకట్టుకూ సాగునీరు పుష్కలంగా అందించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా తుమ్మిళ్ల లిఫ్ట్ కింద మూడు రిజర్వాయర్లను నిర్మించనున్నారు.రెండో విడుతలో మొదటి ప్రాధాన్యతగా వడ్డేపల్లి మండలం తనగల సమీపంలో మల్లమ్మకుంట, తర్వాత ఇటిక్యాల మండలం జులేకల్ వద్ద, వల్లూరు గ్రామాల పరిసరాల్లో రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.386 కోట్లకు సర్కార్ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ఈ రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తే అలంపూర్ నియోజక వర్గంలోని 87,500 ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందనున్నది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు కేటాయించిన 15.9 టీఎంసీలను పూర్తిస్థాయిలో వినియోగించి చివరి ఆయకట్టుకు సాగునీరు అం దించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే తు మ్మిళ్ల ఎత్తిపోతల కింద మూడు రిజర్వాయర్లను నిర్మించేందుకు రూ.386 కోట్లతో పరిపాలనా అనుమతుల ఉత్తర్వులను విడుదల చేసింది. సమైఖ్య పాలనలో ఆర్డీఎస్ ఆయకట్టుకు బచావత్, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునళ్ల కేటాయింపులకు అనుగుణంగా సాగునీరు అందించకపోవడంతో బీళ్లు గా మిగిలాయి. 87,500 ఎకరాలకు సాగునీరందాల్సి ఉం డగా.. ఏనాడూ 30 వేల ఎకరాలకు మించి పారని పరిస్థితి ఏర్పడింది. ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరందించడంలో సమై ఖ్య పాలకులు విఫలం చెందారని.. అప్పటి తెలంగాణ ఉ ద్యమ రథసారధి, ప్రస్తుత సీఎం కేసీఆర్ 2002లో అలంపూర్ నుంచి అయిజ వరకు చేపట్టిన పాదయాత్రలో ఎండగట్టారు.
స్వరాష్ట్రంలో ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్వ వైభవం తెస్తామని.. ఆనాడే రైతులకు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆర్డీఎస్ ఆయకట్టులోని చివరి వరకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 2018 జనవరిలో రూ.783 కోట్ల వ్యయంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చు ట్టారు. రాజోళి మండలం తుమ్మిళ్ల గ్రామ సమీపంలోని తుంగభద్ర తీరంలో మొదటి దశ పనులు చేపట్టారు. రూ. 397 కోట్లతో 55,600 సాగునీరు అందించాలనే లక్ష్యంతో తుమ్మిళ్ల ఎత్తిపోతలను నిర్మించింది. పంప్‌హౌస్, ఫోర్‌బే, అప్రోచ్ కెనాల్, ఆర్డీఎస్ ప్రధానకాల్వ డిస్ట్రిబ్యూటరీ 23 వద్ద డెలివరీ సిస్టర్న్ ఏర్పాటు, 8 కిలోమీటర్ల డబుల్‌లైన్ పైప్‌లైన్ పనులు పూర్తి చేశారు. కేవలం ఎనిమిది నెలల్లోనే ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు నీటిని సరఫరా చేసి చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నది.
రూ.783 కోట్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల..
కర్ణాటకలోని రాజోళిబండ గ్రామ సమీపంలో నిజాం కాలంలో నిర్మితమైన ప్రాజెక్టుల్లో ఆర్డీఎస్ ఒకటి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే చెప్పుకోదగిన ప్రాజెక్టు ఇది. దీని కింద అలంపూర్ నియోజకవర్గంలోని 87,500 ఎకరాలతోపాటు కర్ణాటకలో 10 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న ది. తెలంగాణ, కర్ణాటక పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించేందుకుగానూ 17.01 టీఎంసీల నీటిని కేటాయించారు. తెలంగాణకు 15.9 టీఎంసీలు, కర్ణాటకకు 1.2 టీఎంసీలు కేటాయించారు. కానీ, నాటి ప్రభుత్వా లు ఆర్డీఎస్ను విస్మరించడంతో 30 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందని పరిస్థితి నెలకొన్నది. ఆర్డీఎస్ను ఆధునీకరించకపోవడం, కర్ణాటక ప్రభుత్వం ప్రధాన కాల్వలకు మరమత్తులు చేపట్టకపోవడం తో నీటి సామర్థ్యం తగ్గింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తుమ్మిళ్ల ఎత్తిపోతలకు రూపకల్పన చేశారు. రూ. 783 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఎత్తిపోతలలో భాగంగా మొదటి దశలో రూ.397 కోట్లతో పనులు పూర్తి చేశారు. 2018 అక్టోబర్ చివరలోనే ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంతో రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సస్యశ్యామలం కానున్న అలంపూర్..
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంతో అలంపూర్ నియోజవర్గం సస్యశ్యామలంగా మారనున్నది. రూ.783 కోట్లతో చేపట్టి న ఈ ఎత్తిపోతలతో మొదటి దశ పను లు పూర్తికాగా.. సాగునీరు విడుదల చే స్తున్నాం. నీటిని నిల్వ చేసి రెండు పంటలకు విడుదల చేయాలనే లక్ష్యంతో మల్లమ్మకుంట, జులేకల్, వల్లూరు రిజర్వాయర్ల ప్రతిపాదనను సీఎం కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్లాం. ఇందుకు ఆయన స్పందించి మూడు రిజర్వాయ ర్ల నిర్మాణానికి రూ.386 కోట్లు విడుదల చేస్తూ జీవో కాపీ అం దజేశారు. మొదట మల్లమ్మకుంటను నిర్మించేందుకు కసరత్తు చే స్తున్నాం. తుమ్మిళ్ల కింద నిర్మించనున్న రిజర్వాయర్లతోపాటు నె ట్టెంపాడ్ ప్రాజెక్టు నీటితో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందుతుంది. నియోజకవర్గ రైతులకు మేలు చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. – అబ్రహం, అలంపూర్ ఎమ్మెల్యే
‘మల్లమ్మకుంట’కు ప్రాధాన్యత..
ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలనే లక్ష్యంతో మల్లమ్మకుంట, జులేకల్, వల్లూరు రిజర్వాయర్లను చేపట్టాలని ప్రభుత్వం సంకల్పిస్తున్నది. రెండో విడుతలో భాగంగా వడ్డేపల్లి మండలం తనగల, జులేకల్, ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామాల సమీపంలో మూడు రిజర్వాయర్లను నిర్మించాలని తుమ్మిళ్ల పథకం డిజైన్ చేసిన సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే మూడు రిజర్వాయర్ల నిర్మాణాలకు రూ.386 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. రెండో విడుత మొదటి దశలో మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మూ డు రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తే 87,500 ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. ఆర్డీఎస్ నీటి వాటాను పూర్తిగా సద్వినియోగం చే సుకొని అలంపూర్‌ను కోనసీమగా మార్చేందుకు ప్రభుత్వం చర్య లు తీసుకుంటున్నది. తెలంగాణ సరిహద్దులోని డిస్ట్రిబ్యూటరీ 12ఏ నుంచి 22 వరకు ఆర్డీఎస్ నీరు, 23 డిస్ట్రిబ్యూటరీ నుంచి 45 డిస్ట్రిబ్యూటరీ వరకు తుమ్మిళ్ల పథకం నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది.