ప్రత్యేక అవసరాల పిల్లల కోసం తొలిసారి శాశ్వత టీచర్లను నియమించేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పది మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున ఏర్పాటు చేయాలని సర్కారు జీవో జారీ చేసింది. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిలా ్లవ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 11,260 మంది ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు ఉండగా.. 225 మంది ఉపాధ్యాయులను నియమించనున్నారు. ఈ క్రమంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు ద్వారా మండలానికో భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేసి విద్యనంది స్తున్నది. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు బోధించేందుకు స్పెషల్ బీఈడీ చేసిన వారే అర్హులు.
వనపర్తి టౌన్, ఆగస్టు 28 : భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక హక్కుల్లో భాగంగా విద్యాహక్కును ప్రతి ఒక్కరికీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఈక్రమంలో సాధారణ విద్యార్థులతోపాటు ప్రత్యేక అవసరాలున్న వారి కోసం రాష్ట్రంలో తొలిసారి శాశ్వత టీచర్ల నియామకానికి ఆర్థికశాఖ అమోదం తెలిపి జీవో జారీ చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా త్వరలో వెల్లడికానుంది. మనో విజ్ఞానశాస్త్రజ్ఞుడు గుడ్ అభిప్రాయం మేరకు ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సాధారణ పిల్లలతో కలిపి నిపుణులతో బోధన చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేక టీచర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది.
అందులో భాగంగా పదిమంది విద్యార్థులకు ఒకరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1,523 మంది ప్రత్యేక టీచర్ పోస్టుల నియామకానికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీఓ నంబర్ 125 జారీ చేసి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 11,260 మంది చిన్నారులు ఉండగా 225మంది ఉపాధ్యాయులను నియమించనున్నారు. కాగా ప్రాథమిక పాఠశాలలో బోధించే ఎస్జీటీలకు రూ.31,040-రూ.92,050, ప్రాథమికోన్నత పాఠశాలలో బోధించి స్కూల్ అసిస్టెంట్లకు పేస్కేల్ రూ.42,300 నుంచి రూ.1,15,270గా విద్యాశాఖ ఖరారు చేసింది.
ప్రస్తుతం ఇలా..
శారీరక, మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు రెగ్యులర్ ఉపాధ్యాయులు బోధిస్తే సరిగ్గా అర్థం చేసుకోలేరు. వినికిడి, దృష్టి లోపం ఉన్న విద్యార్థులు చదువులో వెనుకబడడం, మూగ, చెవిటి విద్యార్థులు తమ ప్రతిస్పందనలను సరైన రీతిలో వెల్లడించకపోవడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని వీరికి నిష్ణాతులైన టీచర్లతో బోధన చేయాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 10మంది విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక టీచర్ను నియమించాలని సూచించింది. ఈ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర శిక్ష ప్రాజెక్టు ద్వారా మండలానికి ఒక భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఐఈడీ ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి విద్యనందిస్తున్నది. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు బోధించేందుకు స్పెషల్ బీఈడీ చేసిన వారే అర్హులు. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అమోదం తెలుపగా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 225 పోస్టులకు నియామకాలు జరుగనున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..
వనపర్తి జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలున్న చిన్నారులు 180మంది ఉండగా వారికి 19మంది ఉపాధ్యాయులు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 259మంది విద్యార్థులు ఉండగా 17మంది టీచర్లు అవసరం కాగా 36 మంది ఉపాధ్యాయులను నియమించనుంది. నాగర్కర్నూల్ జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో 411 మంది చిన్నారులకు 41మంది టీచర్ల నియామకం, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 648 మందికి 43మంది టీచర్లు మొత్తంగా 1,059 విద్యార్థులకు 84మంది ఉపాధ్యాయులను నియమించనున్నారు.
మహబూబ్నగర్లో ప్రాథమిక పాఠశాలల్లో 200మంది చిన్నారులకు 20 మంది, ప్రాథకోన్నత, ఉన్నత పాఠశాలల్లో 348మంది చిన్నారులకు 23మంది టీచర్లు.. మొత్తంగా 548మంది విద్యార్థులకు 43మంది ఉపాధ్యాయులను నియమించనున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో 172మంది చిన్నారులకు 17మంది టీచర్లు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 216మంది విద్యార్థులకు 14మంది.. మొత్తం 388మంది విద్యార్థులకు 31మంది టీచర్లను నియమించనున్నారు. నారాయణపేట జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో 163మంది విద్యార్థులకు 16 మంది, యూపీఎస్, హైస్కూళ్లలో 222మంది విద్యార్థులకు 15మంది.. మొత్తంగా 385మంది విద్యార్థులకు 31మంది ఉపాధ్యాయులను నియమించనున్నది. ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్థులకు ఒక టీచర్, యూపీఎస్, హైస్కూళ్లలోని 15 మంది ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు ఒకరి చొప్పున నియామకం చేయనున్నారు.